టమాట దొంగలు..
-రూ. 2.7 లక్షల విలువైన టమాట ఎత్తుకెళ్లిన దొంగలు
-కర్ణాటకలో తోటను మాయం చేసిన కేటుగాళ్లు
-మైసూర్లోనూ టమాటాలు ఎత్తుకెళ్లిన వైనం
-మహబూబాద్ జిల్లాలో సైతం కూరగాయల షాపుల్లో చోరీ
-తోటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న రైతు
Tomato thieves: టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కేజీ టమాటా ధర రూ.150 పైగా ఉంటోంది. ఈ తరుణంలో కర్ణాటక రాష్ట్రం హసన్లో టమాటా దొంగలు హల్చల్ చేశారు. దాదాపు రూ.2.7లక్షల విలువైన టమాట పంటను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు హళేబీడు పోలీసులకు బాధిత రైతు ధరణి ఫిర్యాదు చేశారు. మంగళవారం తన ఫాంహౌస్లో 90 బాక్సుల టమాటాలను ఉంచానని, రాత్రి 9.30 గంటల వరకూ తాను అక్కడే ఉన్నట్లు రైతు తన ఫిర్యాదులో తెలిపారు. బుధవారం ఉదయం ఫాంహౌస్ వచ్చి చూడగా ఆ బాక్సులు కనిపించలేదని పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పొలం వద్ద మందు బాటిళ్లు, సిగరేట్ పీకలను బట్టి ఖచ్చితంగా ఇది స్థానికుల పనేనని అనుమానిస్తున్నారు.
మైసూరులో కూడా టమాటలను ఎత్తుకెళ్లారు. రెండు మార్కెట్లలో ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. ఏపీఎంసీ యార్డు, మార్కెట్లలో టమాటా దొంగిలించారు.APMC యార్డ్ సమీపంలో ఆపి ఉంచిన ట్రక్కు నుండి సుమారు 85 కిలోల టమోటాలు దొంగిలించారు. అదే విధంగా MG రోడ్ మార్కెట్లోని ఒక ట్రక్కు నుండి నాలుగు డబ్బాలను తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక తెలంగాణలో సైతం ఇలాంటి చోరీ చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కూరగాయల మార్కెట్ లోని పలు దుకాణాల్లో చోరీ జరుగుతోంది. తాజాగా, గురువారం ఉదయం సైతం లక్పతి అనే దుకాణదారుడి షాపులో చోరీ జరిగింది. ఇందులో టమాటాలు, పచ్చిమిర్చి దొంగలు ఎత్తుకెళ్లారు. గాంధీసెంటర్ లోని కూరగాయల మార్కెట్ లో రాత్రి వేళల్లో దుకాణాలకు తాత్కాలికంగా నెట్ ఏర్పాటు చేస్తారు. బుధవారం రాత్రి షాపు మూసి వెళ్లిపోయిన లక్పతి ఉదయాన్నే వచ్చి చూడగా, షాపులో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. టమాటా, పచ్చిమిర్చి తీసుకువెళ్లిన కేటుగాళ్లు మిగతా కూరగాయల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. తనకు దాదాపు రూ. 50 వేలు నష్టం జరిగినట్లు లక్పతి వాపోయాడు.
మార్కెట్లలో కూడా అన్ని కూరగాయలు ఒకచోట ఉంటే, టమాటాలు మాత్రం కాస్త విడిగా పెడుతున్నారు. ఒకటీ అర టమాటా కూడా ఎవరూ తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వ్యాపారులు. ఇక పంట తోటలకు సీసీ కెమెరాల రక్షణ ఏర్పాటు చేసుకుంటున్నారు రైతులు. కర్నాటకలోని హావేరి జిల్లాలో టమాాటా తోటలకు సీసీ కెమెరాలు బిగించారు. ప్రత్యేకంగా కాపలా కూడా ఏర్పాటు చేసుకున్నారు.