ముఖ్యమంత్రి వల్లే అదనపు హక్కులు
టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి

Singareni: సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వలననే అనేక హక్కులు వచ్చాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం బెల్లంపల్లి ఏరియా గోలేటి సిహెచ్పీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండడం వల్ల సింగరేణి కార్మికులకు కోలిండియాలో లేని అదనపు హక్కులు అందుబాటులోకి వచ్చాయన్నారు. అదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనేనని ఆయన వెల్లడించారు. సకల జనుల సమ్మె వేతనం చెల్లింపు, బేసిక్ మీద ఒక శాతం విద్యుత్తు బిల్లు మినహాయింపు, 10 లక్షల రూపాయల గృహ రుణ వడ్డీ చెల్లింపు, మహిళలకు ఉద్యోగాలు తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం లాంటి ఎన్నో హక్కులు సింగరేణిలో కల్పించినట్లు చెప్పారు.
బెల్లంపల్లి ఏరియాలోని టీబీజీకేఎస్ నాయకత్వం కార్మికులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పనిచేస్తుండడాన్ని కొనియాడారు. కార్మికులకు అందుబాటులో ఉండే నాయకత్వం టీబీజీకేఎస్ లో ఉందన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగే బొగ్గు గని కార్మికుల వేతనాలు 23 నెలల అనంతరం వేతన ఒప్పందం చేసుకున్నారని, అది కూడా స్వల్ప పెరుగుదలతో జాతీయ సంఘాలు ఒప్పందం చేసుకుని కార్మికులకు అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ యూనియన్ లో పలువురు కార్మికులు చేరారు .
కార్యక్రమంలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, పిట్ సెక్రటరీ మెరుగు రమేష్, టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్ రావు, 11 మెన్ కమిటీ మెంబర్ ధరావత్ మంగీలాల్, సెంట్రల్ కమిటీ నాయకులు రాయలింగు, జీఎం కమిటీ నాయకులు సమ్మయ్య, చంద్రశేఖర్, రవీందర్, వెంకటేష్, మాజీ వైస్ ప్రెసిడెంట్ సదాశివ ఏరియా నాయకులు సంపత్, భాస్కరాచారి, రాజేశం, వీరస్వామి, సోకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.