అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
Amarnath Yatra: ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజుల పాటు నిలిచిన అమర్నాథ్ యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభమైంది. పంజ్‌తర్ని, శేషనాగ్ బేస్ క్యాంపుల నుండి ఈ యాత్ర పునఃప్రారంభించారు. అమర్నాథ్ ఆలయం చుట్టూ వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో అధికారులు ఈ యాత్రకు అనుమతించారు. ఇప్పటికే దర్శనం చేసుకన్న భక్తులను సైతం బల్తాల్ బేస్ క్యాంపునకు తిరిగి అనుమతించారు. మరోవైపు భారత ఆర్మీ అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండ్‌లోని తమ శిబిరంలో భారీ వర్షాల కారణంగా చిక్కుకుపోయిన 700 మందికి పైగా అమర్నాథ్ యాత్రికులకు ఆశ్రయం కల్పించింది. భారీ వర్షాల కారణంగా వారి యాత్ర నిలిచిపోయింది.
అయితే, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేయడం వల్ల జమ్మూ నుంచి అమర్నాథ్ వరకు తాజా బ్యాచ్ యాత్రికులను అనుమతించలేదని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటం, రాంబన్ జిల్లాలో దాదాపు 40 మీటర్ల రహదారి విస్తీర్ణం కొట్టుకుపోవడంతో 3,500 వాహనాలు నిలిచిపోయాయని, హైవేపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని చాలా ప్రాంతాలలో గురువారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అమర్నాథ్ ఆలయం వద్ద హిమాపాతం నమోదైంది. దీంతో కొద్ది రోజుల పాటు సాగిన అమర్నాథ్ యాత్ర ఆపేసిన అధికారులు తాజాగా ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి వాతావరణం మరింత మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి క్లియరెన్స్ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.