శిశుపాలుని వధకు సమయమెచ్చింది..

Kadiam Srihari: ”రాజయ్య చేష్టలను అధిష్టానం గమనిస్తోంది. శిశుపాలునిలా వంద తప్పులు చేసేలా కేసీఆర్ వేచి చూస్తున్నారు. శిశుపాల వధకు సమయం ఆసన్నమైంద”ని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అన్నది కూడా మరెవరినో కాదు… సొంత పార్టీ ఎమ్మెల్యేనే. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కడియంను టార్గెట్ చేస్తూ రాజయ్య పలు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సోమవారం ఎమ్మెల్యే రాజయ్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రాజయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. తన తల్లి బీసీ, తన తండ్రి ఎస్పీ అని కడియం శ్రీహరి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని, ఆ తీర్పు ద్వారా తాను ఎస్సీ కిందకే వస్తానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దళితలపై అంత ప్రేమ ఒలకబోసే నువ్వు వారికి పదవులు అమ్ముకోలేదా అని ప్రశ్నించారు. దళిత బంధు పేరు మీద వందల మంది దగ్గర డబ్బులు వసూలు చేయలేదా అన్నారు.
దళిత బంధు వస్తుందని ఆశతో చాలా మంది తమ భూములు కుదవ పెట్టి రాజయ్యకు డబ్బులు ఇచ్చారని, వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉందని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. తాను అక్రమ ఆస్తులు సంపాదించుకున్నట్లు రాజయ్య ఆరోపించారని, అదే విధంగా తాను ఎన్ కౌంటర్ సృష్టికర్తనని విమర్శలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇతర పట్టణాల్లో, ఇతర దేశాల్లో ఆస్తులు ఉంటే, వాటికి సంబంధించి రాజయ్య ఆధారాలు తీసుకు వస్తే ఘనపుర్ దళిత బిడ్డలకు రాసిస్తానని కడియం శ్రీహరి సవాల్ చేశారు. రాజయ్య గెలుపు కోసం తాను ఎంతగానో కృషి చేశానని, అయినా తనపై, తన కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కడియం తన బాధను వ్యక్తం చేశారు.
తల్లి అనేది సత్యం.. తండ్రి అపోహ అని రాజయ్య తీవ్రవ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు కేవలం కడియం శ్రీహరికే వర్తిస్తాయా? లేక రాజయ్యకు వర్తించవా? అని ప్రశ్నించారు. నా తల్లి సూత్రం.. నా తండ్రి సూత్రం.. రాజయ్యకు కూడా వర్తిస్తాయన్నారు. ఆ మాటకు వస్తే సమాజంలోని ప్రతివారి పుట్టుకను ప్రశ్నించేలా రాజయ్య మాట్లాడారన్నారు. ప్రతి తల్లిని అవమానించేలా, అనుమానించేలా ఉందన్నారు. భారతదేశ కుటుంబ వ్యవస్థ తల్లి, తండ్రి అని ఉంటుందని, కుటుంబ వ్యవస్థను అవమానించేలా రాజయ్య ప్రకటన ఉన్నందుకు వెంటనే మహిళలందరికీ ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తల్లి సత్యం.. తండ్రి అపోహ అంటున్నావ్.. నీవు చదివిన డాక్టర్ ఇదే నేర్పించిందా? ఇదేనా నీ సభ్యత? అని దుయ్యబట్టారు.
తాను దేవాదుల సృష్టికర్తను కాదు.. ఎన్ కౌంటర్ల సృష్టికర్తనని రాజయ్య అంటున్నారని, కానీ 2004 నుండి 2014 వరకు రాష్ట్రంలో ఎక్కువగా ఎన్ కౌంటర్లు జరిగాయని విమర్శించారు. 2004 నుండి 2014 మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్ హయాంలో నక్సలైట్లను చర్చలకు పిలిపించి, మభ్యపెట్టి ఎన్ కౌంటర్లు చేశారని ఆరోపించారు. ఆ రోజు రాజయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పాలన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడని, అప్పుడు జరిగిన ఎన్ కౌంటర్లకు రాజయ్య బాధ్యత వహిస్తే, తానూ బాధ్యత వహిస్తానన్నారు. ఎన్ కౌంటర్ల సృష్టికర్తనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజయ్య ఒత్తిడిలో మాట్లాడుతున్నారన్నారు.
గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, సింగపూర్, మలేసియా తదితర ప్రాంతాల్లో తనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు రాజయ్య ఆరోపణలు చేశారని, కానీ వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకు వస్తే ఘనపుర్ దళితబిడ్డలకు రాసిస్తానన్నారు. ‘రాజన్నా.. నీకో సలహా. నీ వద్ద నా ఆస్తుల గురించి సమాచారం ఉంటే రేపు తీసుకు రా.. ఆ డాక్యుమెంట్స్ అన్నీ రేపు తీసుకు వస్తే నా ఘనపురం దళిత బిడ్డలకు రాసిస్తా’ అన్నారు. ఆ డాక్యుమెంట్స్ కోసం సమయం కావాలంటే వారం రోజులు గడువు ఇస్తానని, అప్పుడైనా తీసుకు రావాలన్నారు. లేదంటే తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇందుకు వారం రోజులే డెడ్ లైన్ అన్నారు. నేను ఘనపూర్ కు ఏం చేయలేదని చెబుతున్నాడని, కానీ ఇక్కడి రిజర్వాయర్, సబ్ స్టేషన్, గురుకుల పాఠశాల, కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు తన హయాంలోనే వచ్చాయని చెప్పారు. నియోజకవర్గంలో రాజయ్యకు ఇష్టం వచ్చిన గ్రామాన్ని ఎంచుకొని.. అక్కడి బొడ్రాయి వద్దకు వస్తే నేను ఆ గ్రామానికి ఏం చేశానో చెబుతానన్నారు