రికార్డులు బ్రేక్ చేస్తున్న తిరుమల హుండీ ఆదాయం

Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం దర్శించని వారు ఉండరు. ఆపదలో ఉన్న వారికి.. ఆపద మొక్కులవాడై, సకల పాప రక్షకుడై ఇలా వైకుంఠంలో వెలిశారు శ్రీనివాసుడు. కోర్కెలు తీర్చే కోనేటి రాయడు కనుకనే రోజుకు లక్ష మందికి పైగా భక్తులు స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు. ఆపద సమయంలో తాము మొక్కుకున్న విధంగా ముడుపులు కట్టి ఆపదలు తొలగిన తర్వాత ముడుపులు భధ్రంగా భక్తి భావంతో స్వామి వారికి సమర్పిస్తారు. తమ స్ధోమత తగ్గట్టుగా చిల్లర నాణేల నుంచి కోట్ల రూపాయల వరకు శ్రీవారి హుండీలో నగదు సమర్పిస్తారు.
శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం సమకూరుతోంది. నిత్యం నాలుగు కోట్ల ఆదాయం వస్తున్న హుండీకి, సోమవారం ఒక్క రోజే రూ. 5.11 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. సోమవారం వెంకన్నను 64వేల 347 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28,358 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మరోవైపు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెలా రూ. వంద కోట్ల మార్కును దాటేస్తోంది. గతేడాది మార్చి నుంచి ప్రతి నెలా హుండీ ఆదాయం ఆ మార్కును అందుకుంటోంది. గత నెల జూన్‌లో వంద కోట్ల మార్కును దాటింది.. జూన్ 1 నుంచి 30 వరకు 20,00,187 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.166.14 కోట్లు లభించింది. గత నెల 18న అత్యధికంగా రూ.4.59 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. హుండీ ద్వారా రూ.7.68 కోట్ల కానుకలను భక్తులు సమర్పించారు. 2022 అక్టోబర్ 23న వచ్చిన రూ.6.31 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం కాగా.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రికార్డు కూడా తిరగరాశారు.