రేవంత్‌రెడ్డికి కరంటు కష్టాలు
-రైతులకు 24 గంటల విద్యుత్ తీసేసి 8 గంటలు ఇస్తామన్న పీసీసీ చీఫ్
-ఆయన వ్యాఖ్యలపై అస్త్రాలు సంధిస్తున్న బీఆర్ఎస్
-నేడు, రేపు ఆందోళనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
-రేవంత్ మాట్లాడింది తప్పే : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Revanth Reddy:ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఉచిత విద్యుత్ 24 గంటలు అవసరం లేదని 8 గంటలు చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికాలోని తానా సభల్లో రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది. మూడెకరాలకు ఫుల్లుగా నీళ్లు పట్టాలంటే మూడు గంటలు చాలు.. అంటే రోజు 8 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంద’ని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకొచ్చాడని ఆరోపించారు. ఉచిత కరెంట్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విమర్శించారు.
అయితే, ఆయన మాటలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. 24 గంటల ఉచిత విద్యుత్ పథకం ఎత్తి వేసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దుయ్యబడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు కేటీఆర్. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. మరోసారి రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించాలని కేటీఆర్ కోరారు.
దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వెళ్లిపోయినా ఆయన నీడలు జాడలు తెలంగాణలో మిగిలేఉన్నాయని రేవంత్ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. 2004లో చంద్రబాబు ఉచిత విద్యుత్‌పై ఏం మాట్లాడారో రేవంత్ అదే మాట్లాడారని అన్నారు. రేవంత్ చంద్రబాబు శిష్యుడని, వారసుడినని నిరూపించుకున్నారని విమర్శించారు. రేవంత్ మాట్లాడిన మాటలు రైతులపై పిడుగుపాటు లాంటివేనని అన్నారు. తమకు అన్ని బాధల నుంచి విముక్తి లభించిందని రైతులు అనుకుంటున్న తరుణంలో రేవంత్ రూపంలో కొత్త బాధ వచ్చిందన్నారు. నీ ఇంట్లో 24 గంటలు కరెంటు ఉండాలి. ఏసీ బంద్ కావొద్దు. రైతులకు మాత్రం 24 గంటలు ఇవ్వొద్దా.. అని ప్రశ్నించారు.
మరోవైపు రేవంత్ వ్యాఖ్యాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా స్పందించారు. రేవంత్ ఏ సందర్భంలో అలా అన్నారో తెలియదని ఒకవేళ రేవంత్ ఉచిత కరెంట్ ఇవ్వకూడదని చెబితే అది తప్పేనని అన్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని అన్నారు. తానైనా, రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీకి కోఆర్డినేటర్స్ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సొంతం కాదని.. రేవంత్ చెబితే ఫైనల్ అవుతుందా? అని ప్రశ్నించారు. ఉచిత కరెంట్ ఇస్తామని దేశంలోనే తొలిసారిగా కాంగ్రెస్ ప్రకటించిందని.. ఈ విషయంలో సోనియాను వైఎస్సార్ ఒప్పించారన్నారు. ఉచిత కరెంట్ ఇచ్చేందుకు చాలా కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతామని చెప్పారు.
ఇలా అధికార పార్టీ నుంచే కాకుండా, సొంత పార్టీ నుంచే ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలన్నీ తొలగిస్తారని ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ చెప్పిన మాటలు ఖచ్చితంగా ఆ పార్టీకి అంది వచ్చిన అస్త్రంగా చెప్పుకుంటున్నారు. ఇక సొంత పార్టీలో ఆయన వ్యతిరేకులు మళ్లీ గళం విప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి వీటి నుంచి రేవంల్ ఎలా బయటపడతారో చూడాల్సిందే.