అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధం చేయండి
Vemulawada: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభానికి సిద్ధం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన నంది కమాన్ జంక్షన్, 1 కోటి 98 లక్షల రూపాయలతో బ్రిడ్జి నుండి వైకుంఠధామం వైపు 330 మీటర్ల మేర నిర్మించిన మూలవాగు బండ్, 2 కోట్ల 91 లక్షల రూపాయలతో నిర్మించిన వెజ్ మార్కెట్, 31 లక్షల 60 వేల రూపాయలతో నిర్మించిన బయో గ్యాస్ ప్లాంట్, మిషన్ భగీరథ ట్యాంక్, కోతులవారి కాలనీలో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
గుడి చెరువు ప్రాంగణంలో శివార్చన స్టేజీ నిర్మాణం, గుడి చెరువు అభివృద్ధి పనులు, తదితర పనులకు శంఖుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, శంఖుస్థాపనలకు చేయాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్, ఆర్డీఓ పవన్ కుమార్, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ఆర్&బి ఈఈ శ్యామ్ సుందర్, తహశీల్దార్ రాజు, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, డీఈ తిరుపతి, ఏఈ లు నరసింహ, నర్మద, తదితరులు పాల్గొన్నారు.