సుమన్ టీవీ ఉద్యోగులకు బంపర్ బొనాంజా

Suman Tv : జీతాల్లో ఎలా కోత విధించాలి.. తమ కులంవారి కోసం ఎదుటి వారిని ఎలా ఇబ్బంది పెట్టాలి.. వారిని ఎలా తొలగించాలి.. కొన్ని టీవీ యాజమాన్యల తీరిది.. ఒక రిపోర్టర్ జీతం పెంచాలంటే వందసార్లు ఆలోచిస్తారు.. కష్టపడి పనిచేసి వాళ్లకి నెల జీతం ఇవ్వాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న యజమాన్యాలు ఉన్న కాలమిది. ఈ మధ్య కొన్ని ఛానల్స్ అయితే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండా.. ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్లు రోడ్డెక్కి నిరసనలు తెలిపినా.. జీతాలు ఇవ్వలేని పరిస్థితులు.
కానీ ఓ తెలుగు టీవీ యాజమాన్యం ఏకంగా తమ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. తమ ఎదుగుదలకు కారణం అయిన ఉద్యోగులకు బెంజ్ కార్లను బహుమతిగా అందించారు సుమన్ టీవీ చైర్మన్ సుమన్ దూది. అంతేకాదు.. వారిని వివిధ విభాగాలను సీఈవోలుగా నియమిస్తూ.. ఐదు లక్షల జీతం.. కోటి రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలను ప్రకటించారు.
సుమన్ టీవీ 8వ వార్షికోత్సవంలో భాగంగా.. ఆ ఛానల్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లు బహుమతిగా అందించారు సుమన్ టీవీ చైర్మన్ సుమన్ దూది. ఈ ఆరుగుర్ని ఆరు విభాగాలకు సీఈవోలుగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యూస్ విభాగానికి సీఈఓగా యాంకర్ నిరుపమ, సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన రోషన్‌ని ఎంటర్టైన్మెంట్ విభాగం సీఈఓగా, ఉమెన్ వింగ్ సీఈఓగా జయలక్ష్మి.. బిజినెస్ సీఈఓగా నాగరాజు.. లైఫ్ స్టైల్ & భక్తి సీఈఓగా గీతాంజలి.. హెల్త్ సీఈఓగా సుదర్శన్‌ని నియమించారు.
తన ఉన్నతికి కారణం తన సంస్థలో పని చేసిన ఉద్యోగులే అని.. తన సక్సెస్ సీక్రెట్ అదేనని సుమన్ టీవీ అధినేత సుమన్ అన్నారు . తన వెనుక కులమో.. మతమో.. రాజకీయ పార్టీలో లేవని.. కష్టపడి పనిచేసే ఉద్యోగులు మాత్రమే ఉన్నారని అన్నారు. కాగా.. ఉద్యోగస్తులకు ఇచ్చిన బెంజ్ కారు ఒక్కొక్కదాని ఖరీరు అక్షరాల 62 లక్షల రూపాయలు. ఇంత ఖర్చు పెట్టి కార్లు ఇవ్వడమే కాదు.. వాళ్లకి నెలకు రూ.5 లక్షల జీతం.. రూ. కోటి రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ అందివ్వడం అనేది మీడియా చరిత్రలోనే లేదని పలువురు జర్నలిస్టులు చెబుతున్నారు.