ముఖ్యమంత్రిపై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు

Cm Kcr : తెలంగాణ సీఎంపై భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి హామీలు ఇచ్చి సరిగ్గా ఏడాది గడిచినా వాటిని నెరవేర్చలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ.100 కోట్లతో రామాలయ అభివృద్ధి చేస్తానని అన్నారని గుర్తు చేశారు. గత ఏడాది జులై 17న సీఎం కేసీఆర్ భద్రాచలంలో పర్యటించారు. ఆ సమయంలో గోదావరి వరద నేపథ్యంలో భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణం కోసం రూ.1000 కోట్లు విడుదల చేస్తామని చెప్పారని, బాధితులకు మరోచోట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏడాదైనా రూ.100 కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సైతం అభివృద్ధి చేయలేదన్నారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ మూడుసార్లు భద్రాచలం వచ్చారని..2015లో మొదటిసారి, 2016లో రెండోసారి, 2022లో మూడోసారి భద్రాచలానికి వచ్చారన్నారు. 2016, 2022 పర్యటనలో భద్రాచలానికి అనేక హామీలు ఇచ్చారన్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని పొదెం వెల్లడించారు. కేసీఆర్ హామీ ఇచ్చి నేటికీ సరిగ్గా ఏడాది అవుతోందని, ప్రజలను మోసం చేసిన ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.