ఆకాశం నుంచి చేపల వర్షం
Fish rain:నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. అయితే ఇక్కడ చేపల వర్షం పడటంతో రోడ్లపై చేపలు పడటం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. వాటిని ఏరుకునేందుకు పరుగులు తీసారు. మునుపెన్నడు లేని విధంగా భారీగా చేపల వాన పడటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు చేపల కోసం తరలి వచ్చారు.
వర్షాకాలంలో పలు చోట్ల చేపల వర్షం కురవడం సహజమేనని పలువురు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో చేపల వర్షం పడటంలాంటి ఘటనలు జరుగుతుంటాయని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది అప్పుడప్పుడు కనిపించే విషయమే. వాతావరణంలో తీవ్ర మార్పులు జరిగే సమయంలో ఏర్పడే సుడిగుండాలు నేలపై నుంచి పైకి వెళుతూ అడ్డువచ్చిన వాటిని పైకి తీసుకుపోతాయి. సాధారణంగా భారీ స్థాయిలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో సుడిగాలి గనుక పెద్ద పరిమాణంలో వచ్చినట్లయితే అందులో ఉన్న చేపలు దానితో పాటుగా మేఘాల లోకి వెళ్లి సమీప ప్రాంతాల్లో వర్షం పడ్డప్పుడు అక్కడ నేలమీదికి వస్తాయి. సుడిగాలి వచ్చిన సమయంలో తీర ప్రాంతాల్లో నీటితో పాటు చేపలు పైకి లేచి మేఘంగా మారి వర్షంతో పాటు పడతాయని చెబుతున్నారు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సుడిగాలులకు కొన్ని కిలోమీటర్ల వరకు కూడా అంత శక్తి ఉంటుందట. దీంతో ఇక్కడ చేపలు అకస్మాత్తుగా వర్షంతో పాటు నేల మీద పడతాయని.. ప్రజలు ఇలాంటి సందర్భాన్ని వింతగా చూస్తారని నిపుణులు చెబుతున్నారు.