కేసీఆర్కు కిషన్ రెడ్డి బంపరాఫర్

Kishan Reddy:’యుద్ధం మొదలైంది.. దానిని బీఆర్ఎస్ ప్రారంభించింది..మేం కూడా సిద్ధంగా ఉన్నామ’ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం, పోడుభూముల కోసం, నిరుద్యోగుల కోసం, రేషన్ కార్డుల కోసం, నిరుద్యోగ భృతి కోసం యుద్ధం చేస్తామన్నారు. కేంద్రమంత్రినే అరెస్ట్ చేస్తారా? పోరాటాలతో వచ్చాం. పార్టీలు మారి రాలేదు.బీర్ఎస్ పాపాలు పండాయ’ని నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి. గురువారం బాటసింగారం వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లకుండా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఆయనను బీజేపీ కార్యాలయానికి తీసుకు వచ్చారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు బంపరాఫర్ ఇచ్చారు. దమ్ము, ధైర్యం ఉంటే 50 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాలని, అలా నిర్మిస్తే కేంద్రం నుండి మ్యాచింగ్ గ్రాంట్ తాను తీసుకువస్తానని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గృహనిర్బంధాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, తమను ఎందుకు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లడానికి బయల్దేరుతుంటే అడ్డుకొని అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడి వరకు వచ్చాయి? మొండి గోడలు తప్ప మరేమీ లేవని, కేసీఆర్ కుటుంబం భయంలో ఉందని కిషన్రెడ్డి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
మీరు 4 నెలల్లో ఇల్లు కట్టుకున్నారు కదా మరి పేదలకు కట్టివ్వరా? బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో కట్టుకోలేదా? అడుగడుగునా ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులను పెట్టుకొని పాలన చేస్తున్నారని అన్నారు. డబ్బా రూముల్లో ఎట్లా ఉంటారని చెప్పిన కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ? శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి ఉగ్రవాదిగా వెంటాడారన్నారని.. తానేమైనా ఉగ్రవాదినా..? నేరస్తుడినా..? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. మానవత్వం లేకుండా పోలీసులు వ్యవహరించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
అకారణంగా బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేశారన్నారు. ఉద్యమం, ధర్నా కాదని చెప్పినా కూడ వందలాది మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. తమ పార్టీ కార్యాలయం ముందు కూడ భారీ ఎత్తున పోలీసులను మోహరించడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తమ పార్టీకి చెందిన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.