మాతా శిశు సంరక్షణా కేంద్రం నుంచి రోగుల తరలింపు
Mata Shishu Rakshakan Kendra: మాతా శిశు సంరక్షణా కేంద్రం నుంచి ముందస్తుగా శుక్రవారం రోగులను తరలించారు. ఈ కేంద్రం నుంచి రోగులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. గోదావరి వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల గోదావరి ఒడ్డునే ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. మంచిర్యాల పట్టణానికి ఎగువనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది. వరద పెరిగితే కచ్చితంగా మాతా శిశు సంరక్షణా కేంద్రాన్ని ముంచెత్తుతుంది. దీంతో మాత శిశు ఆసుపత్రిలో ఉన్న వారిని స్వచ్ఛందంగా మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.
గత ఏడాది కూడా వరదలు రావడంతో అప్పుడు కూడా ఇలాగే గర్భిణీలు, బాలింతలను తరలించారు. గత ఏడాది జులై 12న వరద ఉధృతి పెరిగి మాతా శిశు సంరక్షణా కేంద్రం నీటి మునిగింది. దీంతో హుటాహుటిన వారిని తరలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన ప్రతీసారి వరద ప్రవాహం పెరిగి నేరుగా ఈ కేంద్రంలోకి చేరుతోంది. వరదఉధృతి మరింత పెరిగితే ఎల్లంపల్లి గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తేస్తే, ఈ భవనం నీట మునిగే ప్రమాదం ఉంది. అధికారులు ఏ మాత్రం ఆలోచించకుండా గోదావరి ఒడ్డున నిర్మించడం ఏమిటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరదలు వచ్చిన ప్రతిసారి రోగులను తరలిస్తే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం ఆలోచించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.