ఉగ్రంగా.. పెన్‌గంగ
Penganga: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో పెన్‌గంగ ఉగ్రరూపం దాల్చింది. జైనథ్ మండలం డోలారా వద్ద రహదారిని ముంచెత్తింది. పెన్ గంగ వరద నీరు 50 అడుగులు ఎత్తున ఉన్న వంతెనను తాకాయి. దీంతో 44వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు. పెన్ గంగ ఉధృతికి భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 10 జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రాకపోకలు నిలిపివేయడంతో దాదాపు 20కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా నేషనల్ హైవే అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్ గంగ ప్రవాహం పెరిగిందని తెలిపారు. ఎగువన ప్రాజెక్ట్ గేట్లు మూసివేస్తే వరద ప్రవాహం తగ్గుతుందన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు నీటి ప్రవాహం కొంత మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆ తర్వాతే బ్రిడ్జిపై నుంచి వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమవాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు