అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా…

Heavy rains: కోటి ఆశలతో విత్తులు విత్తుకున్నారు.. చినుకు జాడ లేక నానా ఇబ్బందులు పడ్డారు.. చివరకు అడపాదడపా కురిసిన వర్షాలకు విత్తుకున్నారు. మళ్లీ వర్షాలు లేక చాలా చోట్ల విత్తనాలు మొలకెత్త లేదు. దాంతో మొలకలు కాపాడుకునేందుకు రైతులు బిందెలు, డ్రమ్ములతో నీళ్లు పోస్తూ విత్తనం పాడవకుండా కాపాడుకున్నారు. కొన్నిచోట్ల మళ్లీ విత్తనాలు నాటుకున్నారు..
——–
ఇక ఇప్పుడు వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. అయితే, భారీగా కురుస్తున్న వర్షాలతో రైతులకు మళ్లీ కష్టం వచ్చి పడింది. భారీవర్షాలతో పంటలు నీట మునిగి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంటపొలాల్లో ఇసుక మేటలు వేయడంతోపాటు పత్తి మొక్కలు , సోయా నామరూపాల్లేకుండా పోయాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో విత్తనాలు విత్తుకోవడం చాలా ఆలస్యం అయ్యింది. తొలకరి చినుకుతో భారీ ఆశల నడుమ పత్తిసాగు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ రైతులు వానలు కురవక తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి విత్తు కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. బిందెలు, డ్రమ్ములతో నీళ్లు పోసుకుని విత్తనాలు కాపాడుకున్నారు. సకాలంలో వానలు కురిసేలా వరుణ దేవుడు దీవించాలని కోరుతూ గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వాస్తవానికి రోహిణి కార్తెకు వానలు షురూ అవ్వాలి. మృగశిరకు భారీ వర్షాలు కురవాలి. ఆరుద్ర కార్తె అయిన తర్వాత కూడా వాన జాడ మాత్రం కనిపించ లేదు. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటిన తర్వాత కూడా ఆశించిన మేర వర్షాలు పడలేదు. దీంతో ముందుగానే విత్తనాలు విత్తుకున్న పత్తిపంట ఎండిపోయే ప్రమాదంలో పడింది. విత్తనాలు మొలకెత్తకపోవడంతో తీవ్ర ఆందోళనలో పడిపోయారు పత్తి రైతులు.
జూన్ రెండో వారంలో వేసిన పంటలు మొలకెత్తకపోవడంతో జూన్ మూడో వారంలో కురిసిన వర్షాలకు మరోసారి పత్తి విత్తనాలు నాటుకున్నారు రైతులు. మూడు రోజులు మురిపించిన వానలు.. వారం రోజులు దాటినా కానరాక పోవడంతో ఆ పంటలను కాపాడుకునేందుకు బిందెలతో నీళ్లు పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు మొలకలు కాపాడుకున్నారు రైతులు…
ఇక ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇప్పటి వరకు ఎండకు మొలకలు కాపాడుకున్న రైతులు విపరీతంగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల మొలకలు నీటిలో ముగినిపోయాయి. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో పెనుగంగ వరదలతో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ ప్రవాహ గ్రామాల శివారు పంటలు దాదాపు 25 వేల ఎకరాలు నీటిపాలయ్యాయి.. కొమురం భీం జిల్లాలో సైతం వేలాది ఎకరాలు నీటిలో మగ్గిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ ప్రాంతంలో పెన్‌గంగ వరద ఉధృతితో పంటలు మూడు, నాలుగు రోజులు వరదలోనే ఉండిపోయాయి. పంటపొలాల్లో ఇసుక మేటలు వేయడంతోపాటు పత్తి మొక్కలు , సోయా నామరూపాల్లేకుండా పోయాయి.
మరికొన్ని ప్రాంతాల్లో అయితే పంటచేన్లు చెరువుల్లా మారిపోయాయి. వేసిన పంటల ఆచూకీ లేకుండా పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చాలా చోట్ల పత్తి, సోయ నీళ్లలోనే మగ్గుతోంది. పెన్‌గంగ ఎన్నో ఏండ్ల తర్వాత ఇంతటి ప్రవాహం వచ్చిందని పలువురు చెబుతున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 30 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరద పూర్తిగా తీసిన తర్వాత కానీ, నష్టం పై పూర్తిగా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న అధికారుల హెచ్చరికలతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.