కడెం ప్రాజెక్టుకి ఊహించని వరద
Kadem Project; కడెం ప్రాజెక్టుకు ఊహించని వరద వచ్చి చేరుతోంది.. దీంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ముందు జాగర్త చర్యగా అధికారులు కింది ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేని పరిస్థితి. నీటిని దిగువకు వదులుదామంటే ప్రాజెక్టు నాలుగు గేట్లు మొరాయిస్తున్నాయి. క్షణం క్షణం నీటిమట్టం పెరుగుతోంది. పద్దెనిమిది గేట్లలో నాలుగు గేట్లు తెరుచుకోకపోవడంతో ఎప్పుడేమవుతుందోననే ఆందోళన నెలకొంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఇన్ ఫ్లోగా ప్రాజెక్టులోకి 3,87,583 క్యూసెక్కుల భారీ వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 14 గేట్ల ద్వారా దిగువకు 2,18,922 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 697.800 అడుగులుగా నమోదయ్యింది. ముందు జాగర్త చర్యగా అధికారులు కింది ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.