వరదలో… బురద రాజకీయం
![](https://naandinews.com/wp-content/uploads/2023/07/Balka-Suman-Fires-On-Reavanth-Reddy-1-750x430.jpg)
Balka Suman: రేవంత్ రెడ్డి చిల్లర నాయకుడు.. వరదల సమయంలో అండగా నిలవాల్సిన సమయంలో బురద రాజకీయాలు చేస్తున్నాడని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన చెన్నూరు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చంద్రబాబు పెంపుడు కుక్క అని దుయ్యబట్టారు. ఒక దొంగ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. కష్టకాలంలో అండగా నిలవాల్సింది పోయి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ పై చిల్లర విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలు అని, రైతుబంధు ఎత్తేస్తామని, ధరణి రద్దు చేస్తామని రేవంత్, కాంగ్రెస్ రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగబుద్ధి, వక్రబుద్ధి ఉన్న కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవద్దని, రైతు పక్షపాతి కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్లు నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని బాల్క సుమన్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 18కి పైగా బ్రిడ్జిలు మూడు చెక్ డ్యామ్లు, కొత్త రోడ్లు నిర్మించామని గుర్తు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా..❓️పచ్చబడుతున్న చెన్నూరు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కళ్ళు మండి చిల్లర విమర్శలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎవరు కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ప్రతిపక్షాల ఉచ్చులో పడకూడదని ప్రజలకు ఆయన మరోమారు విజ్ఞప్తి చేశారు.