సంచినంక ఇస్తరా సారూ పైసలు..
MGNREGA:అయ్యా నా పేరు యాదండ్ల సాయమ్మ… నేను తాండూరు మండలం మాదారం గ్రామ నివాసిని. కూలీ పని చేసుకుని బతికేదాన్ని. మా ఊళ్లో అలాగే ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన. నాకు రూ. 12,000 వరకు రావాలి. మూడేండ్ల నుంచి పైసలు రావడం లేదు. డబ్బులు రావడం లేదని సార్లకు ఎన్నోసార్లు చెప్పినా. అయినా పట్టించుకునే నాథుడు కానీ, డబ్బులు ఇచ్చే దొర కానీ లేకుండా పోయిండు. తాండూరు మండలాఫీసుకు, మంచిర్యాల ఆఫీసుకు ఎన్ని సార్లు తిరిగిన్నో లేక్కే లేదు. తిరిగి తిరిగి నా చెప్పులు అగిరిపోయినయ్… కానీ, నన్ను పట్టించుకుంట లేరు.. నా పైసలిత్తలేరు. నాకు వచ్చే రూ. 12,000 మీకు చిన్నగానే అనిపించవచ్చు… ఆ డబ్బులే మాకు ఎన్నో అవసరాలకు అక్కడకు వస్తయ్ సారూ. దాని మీరు చిన్న చూపు చూడటం బాధగా అనిపిస్తోంది.
పోస్టాఫీసులో చూసుకోమ్మని చెబితే అక్కడికి కూడా పోయిన. అక్కడ సార్లతో మాట్లాడి పై వాళ్లకు చెప్పించి మా వద్ద ఏం లేదని చెప్పడంతో మళ్లీ మండలాఫీసుకు పోయినా. మళ్లీ చూద్దాం… చేద్దాం… అనే మాటలు తప్పించి ఇప్పటి వరకు పైసలు రాలే. ఇప్పుడు నాకు ఓపికా లేదు… ఆ పైసల మీద ఆశా లేదు.. నా బిడ్డ దగ్గర ఉంటాన. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్తితి. కానీ, ఒక్కటి సారూ… మీరు దయచేసి సంచినంకనైనా పైసలు ఇప్పించుండ్రి… ఖర్చుల కన్నా అక్కరకు వస్తయ్… నాది ఎట్లాగూ అయిపోయింది. ఇంకా నాలాంటి వాళ్లు 30 మంది వరకు ఉన్నారని విన్నా. కనీసం వాళ్లకైనా పైసలు తొందరగా వచ్చేటట్టు సూడుండ్రి.
ఇట్లు,
మీ సుట్టూ తిరిగి అలిసిపోయిన బాధితురాలు,
యాదండ్ల సాయమ్మ..