ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత
Adilabad: ఓ ఆటో డ్రైవర్, మరో యువకుడి మధ్య చోటుచేసుకున్న వివాదం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ గొడవలో పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు దాడిచేయటంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ గుమిగూడిన జన సమూహాన్ని చెదరగొట్టారు. బాధితులని రిమ్స్ తరలించి కేసు నమోదుచేసుకున్నారు. అక్కడి ఓ దుకాణం ముందున్న CC కెమెరాల్లో గొడవ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీనికి అసలు కారణమేంటనేది అందులో రికార్డు కాలేదు. బాధిత యువకులు తెలిపిన వివరాల ప్రకారం ఆటో డ్రైవర్ దురుసుగా ఆటో తోలటంతో కాలిపై నుండి ఆటో వెళ్ళిందని.. ఇదేంటని ప్రశ్నించగా గొడవకు దిగటమే కాకుండా తన స్నేహితులతో కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఘటనా స్థలివద్ద వందలామంది గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా అక్కడ పోలీసు బలగాలు మొహరించాయి. ముందస్తు చర్యలో భాగంగా వినాయక్ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ లో బలగాలు పహారా కాస్తున్నాయి. సమాచారాన్ని తెలుసుకున్న ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ స్థానిక వినాయక చౌక్‌లో ధర్నా చేశారు.
ప్రశాంత వాతావరణన్ని చెడగొడుతున్నారు…
కొందరు వ్యక్తులు కావాలనే ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న అండదండలతోటి వైస్ చైర్మన్ రెచ్చిపోయి స్థానిక హిందువుల పై దాడికి పాల్పడడం అమానుషమన్నారు. పోలీస్లంటే కూడా భయం లేకుండా పోలీస్ స్టేషన్లో ఎస్సై, సీఐ ముందు తన రౌడీయిజాన్ని ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చేయని దాడులు లేవని, చేయని దందాలు లేవన్నారు. ఇలాంటి వారిని పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న ఇలాంటి ఘటనలపై మౌనం వహించడం ఏమిటన్నారు. ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్న జోగు రామన్న నువ్వు ఒక హిందువు కావా కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ ఎన్ని సార్లు దాడులు జరిగినా ఎందుకు స్పందించడం లేదని జోగు రామన్నను ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మా దళిత బిడ్డ పోలీస్ స్టేషన్లో పిటిషన్ కోసం వెళ్లిన వారిపై కూడా దాడికి దిగడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా జోగు రామన్న మౌనం వీడాలని కోరారు. ఇలాంటి వారిపై పోలీసులు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.