మహావృక్షాలకు పునర్జన్మ
సింగరేణి డైరెక్టర్ బలరామ్ ఆదేశాల మేరకు విజయవంతంగా ట్రాన్స్ లొకేషన్
Singareni:సింగరేణి డైరెక్టర్ బలరామ్ పుణ్యమా అని దశాబ్దాల కాలం నాటి మహా వృక్షాలకు పునర్జన్మ లభించింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఈదురు గాలులకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్‌లోని ఆరు దశాబ్దాల నాటి భారీ మర్రి వృక్షం నేలకు ఒరిగింది. పర్యావరణహితుడు, వన ప్రేమికుడు డైరెక్టర్ ఫైనాన్స్, పర్సనల్ ఎన్.బలరామ్ సూచనల మేరకు ఈ వృక్షాన్ని లోపలి వేర్లతో సహా జేసీబీతో పెకిలించి, భారీ క్రేన్ సాయంతో ట్రక్కులోకి ఎక్కించారు. కొత్తగూడెం బంగ్లాస్ ఏరియాలోని గెస్ట్ హౌస్ ప్రదేశానికి ట్రాన్స్ లొకేట్ చేశారు. అలాగే షటిల్ కోర్టుకు పక్కనే ఉన్న మరో 50 ఏళ్ల వయసున్న భారీ దిరిసినం వృక్షం నేలపై పడిపోయింది. దానిని కూడా ఇదే మాదిరిగా షటిల్ కోర్టు వెనుక వైపు కి ట్రాన్స్ లొకేట్ చేశారు .
గతంలో రామగుండం-1 ఏరియాలో కూడా ఇదే విధంగా కొత్త ఓపెన్ కాస్ట్ గని ప్రాంతంలోని పాతికేళ్ళ వయసు ఉన్న వృక్షాలను కూడా ఇదే విధంగా వేర్లతో సహా తొలగించి వేరే చోట ప్రతిష్టించారు. ఇప్పుడు ఆ చెట్లు తిరిగి వృక్షాలుగా ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. కొత్తగూడెంలో వృక్షాల పునఃప్రతిస్థాపనకు కృషి చేసిన అధికారులు సిబ్బందికి డైరెక్టర్ ఫైనాన్స్, పర్సనల్ ఎన్.బలరామ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.