వారం పాటు వర్షాల్లేవ్..

Rain Updates: తెలంగాణలో వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 15 వరకు తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్ లేదని అధికారులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంది. అక్కడక్కడ వర్షాలు మినహా.. భారీ వర్షాలు కురవలేదు. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని భారత వాతావరణశాఖ వెల్లడించింది. రుతుపవనాలు మందగించిన కారణంగా ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉందని చెప్పారు. అవి కూడా సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయన్నారు.
మరోవైపు రాష్ట్రంలో చలి వాతావరణం నెలకొని ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇటీవల పిడుగులతో కూడిన వర్షఆలు కురవటంతో ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు చెప్పారు. చాలా చోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. మరీ ముఖ్యంగా ఉదయం పూట వాతవారణం చల్లబడతుందని అన్నారు. మరో వారం పాటు ఉదయం వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని చెప్పారు. కాగా, మధ్యాహ్నం తర్వాత వాతావరణ పరిస్థితులు మారుతాయన్నారు.
దేశంలో ప్రస్తుతం ఈశాన్య, తూర్పు, ఉత్తర భారత్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో వానలు పడుతుననాయి. ఈశాన్య రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలకంగా మారటంతో భారీ వర్షాలు ఉన్నాయి. కానీ ఇటు వైపు మాత్రం ఆ పరిస్థితి లేదు.