ఇంజన్లు ఆగినా… ల్యాండింగ్ ఆగదు
చంద్రయాన్-3 ల్యాండింగ్‌పై ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటన
Chandrayaan-3:చంద్రయాన్-3 ల్యాండింగ్ విషయంలో వ్యోమనౌక ఫెయిల్ అయినా ఎలాంటి ఇబ్బంది లేదని ఇంజన్లు అన్ని సెన్సార్లు పనిచేయకపోయినా ల్యాండర్ దానిని సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. బెంగళూరులో ఎన్జీవో దిశ భారత్ ఏర్పాటు చేసిన ‘చంద్రయాన్-3: భారత్స్ ప్రైడ్ స్పేస్ మిషన్’కార్యక్రమంలో ఇస్రో చీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ ‘అంతా విఫలమై అన్ని సెన్సార్లు ఆగిపోయి.. ఏమీ పని చేయకపోయినా.. ప్రొపల్షన్ సిస్టమ్ పనిచేస్తే అది (విక్రమ్) ల్యాండింగ్ చేస్తుంద’ని సోమనాథ్ చెప్పారు.
జులై 14న షార్ నుంచి బయలుదేరిన వ్యోమనౌక.. కొద్ది రోజుల పాటు భూకక్ష్యలోనే పరిభ్రమించింది. ఆగస్టు 5న ఇంజిన్లు మండించి.. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెటారు. ఆగస్టు 6న కూడా ఒకసారి కక్ష్య తగ్గించారు. మరో మూడు సార్లు ఆగస్టు 9, ఆగస్టు 14, ఆగస్టు 16 తేదీలలో ఇలాగే చేసి.. చివరిగా ఆగస్టు 23న జాబిల్లి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయనున్నారు. ల్యాండర్ ‘విక్రమ్’ను ఫెయిల్యూర్ విధానంలో రూపొందించారు. ‘ఈసారి కూడా రోవర్ విక్రమ్‌లో రెండు ఇంజన్లు పని చేయకపోతే, అది ల్యాండ్ అయ్యేలా చూసుకున్నాం’ అని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. కాబట్టి అల్గారిథమ్‌లు సరిగ్గా పనిచేస్తే విక్రమ్ అనేక వైఫల్యాలను నిర్వహించగలదని నిర్ధారించుకునేలా డిజైన్ చేశాం’ అన్నారాయన.
ఇస్రో బృందం ముందున్న అతిపెద్ద సవాల్ చంద్రుని ఉపరితలంపై నిలువుగా ‘విక్రమ్’ సాఫ్ట్ ల్యాండ్ చేయడమే. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత అది అడ్డంగా కదులుతుందని సోమనాథ్ చెప్పారు. విన్యాసాల అనంతరం చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ చేయడానికి దీనిని నిలువు స్థితికి తీసుకొచ్చామని తెలిపారు. చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో విఫలం కావడంతో ఈ ప్రక్రియ చాలా కీలకమైనదని వెల్లడించారు. ‘ఇక్కడ కీలకమైంది క్షితిజ సమాంతర నుంచి నిలువు దిశకు బదిలీ చేయగల సామర్థ్యం.. మేము చివరిసారి ఈ సమస్యను ఎదుర్కొన్నాం’ అని సోమనాథ్ స్పష్టం చేశారు. స్పేస్ క్రాఫ్ట్ ఇంధనం తక్కువగా ఉందని, గణనలు సరిగ్గా ఉన్నాయని, అన్ని అల్గారిథమ్‌లు సరిగ్గా పనిచేస్తాయని నిర్ధారించుకోవడం కూడా సవాల్ అని ఇస్రో చీఫ్ వివరించారు. అయితే, ఇస్రో బృందం ఈసారి లెక్కల్లో కొన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ, విక్రమ్‌ను సురక్షితంగా ల్యాండ్ చేసే ప్రయత్నం చేసేలా ఏర్పాట్లు చేసిందని సోమనాథ్ వివరించారు.