కేసీఆర్‌ది కపట ప్రేమ

Kokkirala Surekha: గిరిజన ప్రాంతాలు, ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అపారమైన ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని అది కపట ప్రేమ మాత్రమేనని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్పష్టం చేశారు. ఆమె మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గిరిజన ప్రాంతమైన నాగారంలో పల్లె నిద్రలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకుని, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన ప్రాంతాలపైకనీస మౌలిక సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని దుయ్యబట్టారు. గిరిజనులపై పెరుగుతున్న దురాగతాలను కేంద్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ఆదివాసులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆదివాసుల సమస్యలను వెంటనే పరిష్కారిస్తామని సురేఖ వారికి భరోసా కల్పించారు.