మంచిర్యాలలో మరో హత్య
Manchariyal: మంచిర్యాల జిల్లాలో వరుస హత్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బుధవారం తాండూరు మండలంలో జరిగిన హత్య మరువకముందే గురువారం జిల్లా కేంద్రంలో యువతి దారుణ హత్యకు గురైంది. మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన యువతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంచిర్యాల గోపాలవాడకు చెందిన శరణ్య అనే మహిళ మెడి లైఫ్ హాస్పిటల్ లో రిసెప్షనిస్టు గా పని చేస్తోంది. ఈరోజు సాయంత్రం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్ పక్కన కత్తులతో పొడిచి చంపారు. కత్తులతో పొడిచిన అనంతరం బండరాళ్లతో మోదినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఆమె భర్త సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి బంధువుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.