తిరుమలలో విషాదం.. చిన్నారిని చంపేసిన చిరుత

Tirumala :తిరుమల కొండపై విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారిని చిరుత చంపేసింది. నరసింహ స్వామి ఆలయం దగ్గర శుక్రవారం రాత్రి రక్షిత అనే పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం రక్షిత మృతదేహాన్ని ఉదయం నరసింహ స్వామి ఆలయం దగ్గర గుర్తించారు.. ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి.
నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులు అలిపిరి నడకదారి మార్గంలో తిరుమలకు బయల్దేరారు. నరసింహస్వామి ఆలయం దగ్గర రక్షిత కనిపించలేదు. ఆ వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, పోలీసులు బాలిక తప్పిపోయిందనే భావించారు తప్ప, చిరుత పులి దాడి చేసిందని గ్రహించలేదు. దీంతో ఈ ఘోరం జరిగిందని చెబుతున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేశారు. ఎక్కడా పాప ఆచూకీ దొరకలేదు. పాపను రాత్రే చిరుతపులి దాడి చేసి చంపేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులతో వెళుతున్న పాప ఎలా తప్పిపోయింది.. అసలు చిరుతకు ఎలా చిక్కింది అనేది తెలియలేదు.
రెండు నెలల కిందట కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. తాతతో పాటూ ఓ షాపు దగ్గర ఆగిన బాలుడ్ని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అదే సమయంలో అటు వెళుతున్న ఎస్సై అప్రమత్తం అయ్యారు. అటవీ ప్రాంతంవైపు వెళ్లి గాలించారు. ఈ క్రమంలో బాలుడ్ని చిరుత దగ్గరలోనే వదిలేసి వెళ్లింది. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా కోలుకున్నాడు. అనంతరం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిరుతను తీసుకెళ్లి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. చిరుత బెడద తప్పిపోయిందని భావిస్తున్న సమయంలో ఇప్పుడు చిరుత బాలికను చంపేయడం కలకలంరేపుతోంది.