తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత

Tirumala : తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి భక్తులకు చిరుత కనిపించంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం నడకమార్గంలోని 2,450 మెట్టు వద్ద చిరుత పులి నడకదారి భక్తులకు కనిపించడంతో అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్ధలానికి చేరుకున్న అటవీ శాఖాధికారులు చిరుత కనిపించిన ప్రాంతంలో శబ్ధాలు చేస్తూ చిరుతను అటవీ ప్రాంతంలోనికి పంపే ప్రయత్నం చేశారు. రెండు రోజుల కిందటే అలిపిరి నడక మార్గంలో ఆరేండ్ల బాలిక లక్షితపై దాడి చేసి చంపేయడంతో అప్రమత్తమైన టీటీడీ పలు చర్యలు తీసుకుంటోంది.
100 మందికి కలిపి ఒక గుంపుగా పంపిస్తుండగా.. వారికి పైలట్‌గా ఒకరిని నియమిస్తున్నారు. తాళ్ల సహాయంతో భక్త బృందానికి ముందు వైపు, వెనుక వైపు మరికొందరు భధ్రతా సిబ్బంది నడుమ సురక్షితంగా పంపుతున్నారు. అలిపిరి నడక మార్గంలో చిన్నారులు తప్పి పోకుండా ట్యాగ్స్ వేస్తున్నారు. చంటి పిల్లల తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ, ఆదివారం మధ్యాహ్నం నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల నుండి అలిపిరి నడక మార్గంలో అనుమతి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చిరుత సంచరిస్తున్న కారణంగా ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ ద్విచక్ర వాహనాలను అనుమతిని టీటీడీ రద్దు చేసింది.
శనివారం ఒక్క రోజే అలిపిరి నడక మార్గం, ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలలో, గాలిగోపురం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో రెండోవ ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద వాహనదారులకు చిరుత తారస పడింది. వాహనదారులు సమాచారం మేరకూ ఘటన స్ధలం వద్దకు చేరుకున్న అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతం జల్లెడ పట్టారు.. అదే విధంగా ఆదివారం సాయంత్రం 2450వ మెట్టు వద్ద భక్తులకు చిరుత కనిపించింది. అటవీ శాఖ సిబ్బంది చిరుత పులి మళ్లీ నడక మార్గంలోకి రాకుండా భారీ శబ్దాలు చేస్తూ చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేస్తున్నారు.
చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయింది. సోమవారం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైలెవల్ సమావేశం నిర్వహిస్తున్నారు. కాలినడక మార్గాలు,ఘాట్లలో యాత్రికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇప్పటికే రెండు ఘాట్ రోడ్లలో ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతించనుంది. ఆ తర్వాత బైక్‌లను కొండపైకి అనుమతించరు. 15 ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతించరు.