శేషాచలం అటవీ ప్రాంతంలో 30 చిరుతలు

Tirumala :శేషాచలం అటవీ ప్రాంతంలో ఏకంగా 30 వరకు చిరుతలు తిరుగుతున్నాయి. అ అడవిలో చిరుతలు తిరుగుతున్నాయని, అయితే తిరుమల కాలిబాట అటవీ మార్గంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో త్వరలోనే అధ్యయనం చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన ప్రాంతంలో చిరుత చిక్కింది. బాలిక మృతి తర్వాత అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఘటనాస్థలంతో పాటుగా ఆ చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
పట్టుబడింది ఆడచిరుత అని దాని వయస్సు మూడేళ్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతంలో నమూనాలు సేకరించారు. బాలిక పై దాడి చేసిన చిరుత.. పట్టుబడ్డ చిరుత ఒక్కటేనా అన్నదానిపై పరీక్షలు జరిపి నిర్ధారించనునున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో 30 చిరుతలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. నడక మార్గానికి సమీపంలోని కిలో మీటర్ పరిధిలో 500 కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్ని చిరుతలు సంచారిస్తున్నాయో గుర్తిస్తామని వెల్లడించారు. 7వ మైల్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నారు.