ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట షేజల్ బైఠాయింపు
-తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని వెల్లడి
-తమ కంపెనీకి అమ్మిన భూమి వేరేకొరికి అమ్ముతున్నారని ఆరోపణ
-అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించిన పోలీసులు
Bellampalli:తనపై బెల్లంపల్లి ఎమ్మెల్యే లైంగిక వేధింపులు చేస్తున్నాడని ఆరోపిస్తున్న యువతి షేజల్ మరోమారు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు. తనకు ఎక్కడా న్యాయం జరగడం లేదని, తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆమె ప్లకార్టుతో కార్యాలయం ఎదుట కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు న్యాయం కావాలంటే ఏ ఒక్కరూ పట్టించుకోవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గం చిన్నయ్య లైంగిక ఆరోపణలు తనపై కావాలనే చేస్తున్నారని అంటున్నారని, ఎవరూ కావాలనే లైంగిక ఆరోపణలు చేయరన్నారు. ఆయన వేధింపుల జాబితాలో మరికొందరు బాధితులు ఉన్నారని ఆరోపించారు.
మీడియా ఎమ్మెల్యేను లైంగిక వేధింపుల గురించి ప్రశ్నిస్తే ఆ అమ్మాయినే అడగండని చెబుతున్నారని అన్నారు. నేను డైరెక్ట్‌గానే వచ్చానని ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని చెప్పారు. ఏడు నెలల నుంచి ఇలాగే పోరాటం చేస్తున్నామన్నారు. ఇక్కడి నుంచే పోలీసులు తమను కిడ్నాప్ చేసి మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని అట్నుంచి అటే జైలుకు పంపిచారన్నారు. ఎమ్మెల్యే భూమి తమ కంపెనీకి అమ్మి తిరిగి వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చిన్నయ్య ఒక్క భూమి ఎంత మందికి అమ్ముతారని షేజల్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే అనుచరులు బీమాగౌడ్, సున్నపురాజు చాలా మంది అనుచరులు తన ఇంటికి వచ్చి బెదిరించారని, ఇప్పుడు మీ ఇంటి ఎదురుగా వచ్చానని చెప్పారు. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి తనకు న్యాయం చేయాలని పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యేకు మద్దతు చెప్పడానికి సిగ్గుండాలని, మీ ఇంట్లో ఆడవాళ్లకు అన్యాయం జరిగితే కూడా ఇలాగే సపోర్ట్ చేయండంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012 నుంచి తనపై కేసులు ఉన్నాయని ఎమ్మెల్యే చెబుతున్నాడని అప్పుడు తాను ఆరో తరగతి చదువుతున్నానని వెల్లడించారు. నేరుగా మీ ఇంటి ముందే కూర్చున్నానని వచ్చి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
షేజల్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇంటి ముందు ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు.