వీళ్లు మారరు…
-కాంగ్రెస్ బీసీ ఐక్యవేదిక సభలో ఉద్రిక్తత
-సీనియర్ వేత వీహెచ్ సాక్షిగా రసాభాస
-కంది, సాజిద్‌ఖాన్ వర్గాల మధ్య వర్గపోరు
Congress: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీసీ ఐక్యవేదిక సభ రసాభాసగా మారింది. ఆదిలాబాద్ నియోజకవర్గ నేతల మధ్య వివాదం మరోసారి బట్టబయలైంది. విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా వి.హనుమంతరావు హాజరు కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎన్నారై కంది శ్రీనివాస్ రెడ్డిని సభలోకి రాకుండా కొందరు అడ్డుకున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిత్ ఖాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను సభకు రాకుండా అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అటు కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులు సైతం గొడవకు దిగారు. ఒకానొక సందర్భంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా, అక్కడే ఉన్న కొంతమంది నేతలు సముదాయించడంతో కంది శ్రీనివాస్ రెడ్డి వెనక్కి తిరిగి పోయారు. అనంతరం కంది శ్రీనివాస్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రకటించారు. క్రమ శిక్షణ లేకుండా వ్యవహరించడం తో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.