కేసీఆర్ చేతిలోనే తెలంగాణ భద్రం
-అన్ని వర్గాలకు సమ న్యాయం
-ప్రభుత్వ నిర్ణయంతో రేషన్ డీలర్లలో సంబరాలు
-ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్

Balka Suman: అప్పుడే పుట్టిన పసికందును తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో.. తొమ్మిందేడ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అంత భద్రంగా కాపాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన రేషన్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వంతో రేషన్ డీలర్ల చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ డీలర్ల అడిగిన ప్రధాన డిమాండ్లను అన్ని నెరవేర్చాలని చెప్పారని దానికి తానే ప్రత్యక్షసాక్షినని తెలిపారు. తమ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డీలర్లు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. రేషన్ డీలర్ల సంక్షేమంలో భాగంగా కమీషన్ పెంపు, హెల్త్ కార్డులు, భీమా కల్పనతో పాటు ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న 13 సమస్యలను పరిష్కరించడంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు.
క్వింటాలు ఇస్తున్న రూ.70 రూపాయల కమీషన్ రూ.140 రూపాయలకు పెంచినట్లు వివరించారు. ప్రతి రేషన్ డీలర్‌కు రూ. 5 లక్షల రూపాయల భీమా, డీలర్ మృతి చెందితే అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున 10 వేల రూపాయలు అందించడం, కరోనా సమయంలో మరణించిన డీలర్ల వారసులకు డీలర్షిప్, డీలర్ల వయోపరిమితి 40 నుంచి 50 సంవత్సరాలకు పెంచడం, ప్రతి ఎం.ఎల్.ఎస్. పాయింట్ దగ్గర వే బ్రిడ్జిల ఏర్పాటు, కుటుంబానికి రూ.5 లక్షల వరకు దవాఖాన ఖర్చుల కోసం హెల్త్ కార్డులు జారీ చేయడం లాంటి దాదాపు 13 గొప్ప నిర్ణయాలను రేషన్ డీలర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ నిర్ణయంతో జిల్లాలో 423 మంది రేషన్ డీలర్లకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.
కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకరావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎ.ప్రేమ్ కుమార్, జిల్లా మేనేజర్ గోపాల్, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధి రవీందర్ తదతరులు పాల్గొన్నారు.