యువతిని రక్షించి… పరీక్ష రాయించి…

Sakshi Centre: పరీక్ష రాసే సమయానికి కేంద్రానికి చేరుకుంటానో…? లేదో..? అని ముందు రోజే బయల్దేరింది ఓ యువతి… రాత్రి సమయం కావడంతో ఎటు వెళ్లాలో దిక్కుతోచలేదు… దీంతో స్థానికులు ఆ మహిళను గమనించి సఖి కేంద్రానికి ఫోన్ చేశారు. సఖి సిబ్బంది ఆ యువతిని రక్షించి… తెల్లవారి పరీక్ష రాయించి ఆమె తల్లికి అప్పగించారు… వివరాల్లోకి వెళితే.. జగిత్యాలకు చెందిన ఓ యువతి డిగ్రీ పరీక్షలు రాసేందుకు లక్ష్సెట్టిపేట వచ్చింది. పరీక్ష బుధవారం ఉండగా, మంగళవారం రాత్రే కేంద్రానికి చేరుకుంది. రాత్రి 11.30 ప్రాంతంలో అక్కడ తచ్చాడుతున్న ఆ మహిళను చూసి కొందరు ఆరా తీశారు. చివరకు మహిళా హెల్ప్ లైన్ 181కు కాల్ చేశారు. సఖి కేంద్రం సిబ్బంది లక్ష్సెట్టిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వద్దకు వెళ్లి ఆ మహిళను మంచిర్యాలకు తీసుకువచ్చారు. బుధవారం పరీక్ష రాయించి ఆ యువతి తల్లిని పిలిపించి ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం సీఏ శ్రీలత మాట్లాడుతూ మహిళల రక్షణ కోసమే సఖీ కేంద్రమని, 24 గంటలూ కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు.