కేసీఆర్కు నిద్రలేని రాత్రులే
-నిర్మల్ జిల్లాలో రైతులపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నా
-మీ అక్రమాలను ప్రశ్నిస్తే.. మా కార్యకర్తలపై దాడులా?
-కేసీఆర్ సర్కారుపై ధ్వజమెత్తిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

Bjp: నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం రాస్తారోకో చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులతో కేసీఆర్ సర్కారు దాడిచేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది ప్రజాసమస్యలపై స్పందించడం చేతకాని ప్రభుత్వం అని దుయ్యబట్టారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ నాలుగు రోజులుగా అమరణ నిరాహార దీక్ష బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా స్పందించకపోవడం దారుణమన్నారు. దీన్ని నిరసిస్తూ.. నిర్మల్ బస్టాండ్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో చేస్తే. పోలీసులు లాఠీచార్జి చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన పలువురు రైతులకు అవసరమైన చికిత్స అందించాలని జిల్లా నాయకులకు కిషన్ రెడ్డి సూచించారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వీటిని పట్టించుకోకపోగా.. ప్రజావ్యవస్థను మరింత సంక్లిష్టంగా మారుస్తోందని కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెనక్కు తీసుకోకపోతే.. కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనన్నారు.