అభివృద్ధి యజ్ఞం ఆగదు..
-అభివృద్ధి చేసినా... చేస్త... ఆశీర్వదించండి
-ముఖ్యమంత్రి చొరవతో వందల కోట్ల నిధులు
-గత పాలకులు ఇక్కడి ప్రజలను కనీసం పట్టించుకోలేదు
-చెన్నూరు రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా ఎదుగుతుంది
-ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

Balka Suman: గత పాలకులు చెన్నూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు వందల కోట్ల నిధులతో అభివృద్ది జరుగుతోందని… ఇంకా చేస్తానని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది అభివృద్ధి యజ్ఞమని.. ఆగదని స్పష్టం చేశారు. 2014 ముందు పాలించిన ఏ నాయకుడు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి మంత్రులుగా కొనసాగిన ప్రతిపక్ష పార్టీలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఇందారం, రసూల్ పల్లి, సుబ్బరామ్ పల్లి, గంగారం, కిష్టంపేట, సుద్దాలల్లో 18 బ్రిడ్జీలను నిర్మించామని స్పష్టం చేశారు. చెన్నూరు నడిబొడ్డున నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ దవాఖాన త్వరలో ప్రారంభిస్తామన్నారు. పట్టణానికి అనుకొని నిర్మిస్తున్న వంద పడకల దవాఖాన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. సుమారు రూ. 500 కోట్లతో మూడు మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
నాలుగు కోట్లతో నాలుగు ఎకరాల్లో చెన్నూర్ బస్సుడిపో ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించి రవాణా వ్యవస్థ మెరుగు చేస్తున్నామని, మందమర్రిలో నిర్మిస్తున్న 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, క్యాతనపల్లిలో నిర్మిస్తున్న 286 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని విప్ బాల్కసుమన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సుమారు రూ. 80 కోట్లతో మందమర్రి రామకృష్ణాపూర్ పట్టణాలలో రైల్వేఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని, ఈ రెండు బ్రిడ్జిలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. రూ.500 కోట్లతో మందమర్రి మండలంలో ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రూ. 1658 కోట్లతో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించే చెన్నూర్ ఎత్తిపోతల పథకం పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
చెన్నూరు బీఆర్ఎస్, కేసీర్ కంచుకోట అన్నారు. 82% ప్రజలు చెన్నూరులో బీఆర్ఎస్ కే ఓటేస్తామని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు. చెన్నూరులో బీఆర్ఎస్ తుఫాన్ నడుస్తోందని, భారీ మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించాలని బాల్క సుమన్ కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ కే ఓటెయ్యాలని, రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. చేసిన అభివృద్ధి ప్రజల ముందు ఉంది. ప్రజలపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.