కుట్లు వేసిరి… దూది మరిచిరి…
-మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
- బాలింతకు ఆపరేషన్ చేసి దూది మరిచిన ప్రభుత్వ వైద్యులు
-తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చెన్నూరు ఆసుపత్రికి తరలింపు
- ఆపరేషన్ చేసి దూది తీసేసిన వైద్యులు
-ప్రస్తుతం కోలుకుంటున్న బాధితురాలు

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింతరాలు తీవ్ర ఇబ్బందులు పడింది. తీవ్రఅస్వస్థతకు గురైన ఆమె కష్టాలు వర్ణణాతీతం. వివరాల్లోకి వెళితే.. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గత ఐదు రోజుల కిందట కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పురిటినొప్పులతో ఆసుపత్రిలో ఆ మహిళకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఆపరేషన్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు తర్వాత ఐదు రోజుల నుండి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్న కీర్తిలయను డాక్టర్లు సోమవారం డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆ బాలింత తన స్వగ్రామమైన వేమనపల్లి మండలంలోని నీల్వాయి వెళ్లింది.
అయితే, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమెకు కడుపునొప్పితో పాటు అస్వస్థతకు గురైంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంత కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే 108 ద్వారా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రాత్రి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్లు కీర్తిలయను పరిశీలించి ఆపరేషన్ చేసి అందులోనే కాటన్ పాడ్ మర్చిపోయినట్టు గుర్తించారు. ఆ డాక్టర్లు అది తొలగించారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలింత ఆరోగ్యంగానే ఉందని, కొలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసి కాటన్ ప్యాడ్ మర్చిపోవడం ముమ్మాటికి డాక్టర్ల నిర్లక్ష్యమే అని… కలెక్టర్, ఉన్నతాధికారులు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.