గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింపు..
Gas cylinder:కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు రాఖీ, ఓనం సందర్భంగా శుభవార్త అందించింది. వంట గ్యాస్‌పై అదనంగా రూ. 200 చొప్పున రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇక ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకున్న వారికి రూ. 400 రాయితీ లభించనుంది. గృహ అవసరాల కోసం వంట గ్యాస్ కొనుగోలు చేసే ఉజ్వల పథకం లబ్ధిదారులతోపాటు అన్ని కేటగిరీల వినియోగదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని.. రాఖీ పండుగ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకగా అభివర్ణించింది.
ఎల్పీజీ ధర తగ్గింపుపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. పేదల కోసం తీసుకొచ్చిన ఉజ్వల పథకం కింద ఒక్కో సిలిండర్‌పై ఇప్పటికే రూ.200 రాయితీ ఇస్తుండగా.. ఇకపై రూ.400 సబ్సిడీ అందుతుందని వివరించారు. మిగిలిన వినియోగదారులకు రూ.200 రాయితీ అందుతుందని చెప్పారు. ఉజ్వల పథకం కింద కొత్తగా 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకం కింద ప్రస్తుతం 9.6కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ’75 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు.. కొత్త కుటుంబాలకు కూడా ఇస్తాం. ఆడపిల్లలకు పెళ్లై కొత్తగా కుటుంబాలుగా ఏర్పడి.. కొత్త రేషన్ కార్డులు పొందినవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది.’ అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
మహిళల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం మరెన్నో చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. పక్కా ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, కొవిడ్ సమయంలో అదనంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సాయం చేయడం వంటివాటిని ప్రస్తావించారు.
ప్రస్తుతం దిల్లీలో 14.2కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1,103గా ఉంది. కేంద్రం రాయితీ అందిస్తున్న నేపథ్యంలో బుధవారం నుంచి రూ.903 చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఉజ్వల యోజన లబ్ధిదారులు ఒక్కో సిలిండర్‌కు రూ.903 చెల్లిస్తుండగా.. ఇకపై ఆ మొత్తం రూ.703కు తగ్గనుంది.
వంట గ్యాస్‌ను అతి తక్కువ ధరకే అందిస్తామని తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికే హామీ ఇచ్చింది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా హామీలకు కౌంటర్‌గా ఎల్పీజీ ధరను కేంద్రం తగ్గించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.