బస్సు ఎక్కు.. గిఫ్టు పట్టు..
-మహిళా ప్రయాణికులకు TSRTC శుభవార్త
-రూ.5.50 లక్షల విలువైన బహుమతులు

TSRTC Rakhi Special :రాఖీపౌర్ణమి సందర్భంగా తమ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు TSRTC శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువైన బహుమతులు అందించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది. ఎలాగంటే.. ఈనెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ తమ ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ల్ వేయాలి. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్యఅతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు.
“మహిళలకు రాఖీపౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీడ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ నెల 30,31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేస్తామ”ని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రాఖీ పౌర్ణమికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశించారు. రక్షాబంధన్‌కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు 1000 బస్సుల చొప్పున నడపనున్నట్లు పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల ఇతర రూట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సోదరీ,సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ఈ సందర్భంగా మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది రద్దీ దృష్ట్యా ఈ సారి రెగ్యులర్ సర్వీసులకు తోడు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత రాఖీపౌర్ణమి రోజు అక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 87 శాతంగా నమోదైంది. నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ రీజియన్లు 90 శాతానికిపైగా అక్యూపెన్సీ సాధించాయి. 12 డిపోల్లో 100 శాతం ఓఆర్ నమోదైంది. గత రికార్డుల నేపథ్యంలోనే ఈ సారి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.