బెల్లంపల్లిలో ఉద్రిక్తత
-షేజల్ ప్రచారం అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతల ప్రయత్నం
-బీజేపీతో నీకేం సంబంధం అంటూ షేజల్పై ఆగ్రహం
-బీజేపీ నేతలను బూతులు తిడుతూ గొవడకి దిగిన బీఆర్ఎస్ నేతలు
-షేజల్ను రూరల్ స్టేషన్ తరలించిన పోలీసులు
-బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ ఇంటి ఎదుట బీఆర్ఎస్ ఆందోళన
Durgam Chinnayya:ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా యువతి షేజల్ చేస్తున్న ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆమె ప్రచారాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు. అనంతరం పోలీసులు షేజల్ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న షేజల్ అనే యువతి బెల్లంపల్లిలో ప్రచారం ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణం రోడ్ నెంబర్ 3లో ఆమె చిన్నయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరికైనా ఓటేయండి… కానీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఎవరూ ఓటేయద్దు.. కామాంధుడు, లైంగిక వేధింపులకు పాల్పడతాడని దుయ్యబట్టారు. అందుకే అతన్ని ఎవరు నమ్మకూడదని షేజల్ ప్రచారాన్ని కొనసాగించారు. మొదట షేజల్ ప్రచారాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె ప్రచారానికి బీజేపీ నాయకులు మద్దతు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. దీంతో ఆమె ప్రచారం కొనసాగించారు.
అయితే, అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు మద్దతు ఇస్తున్న బీజేపీ నాయకులను బూతులు తిడుతూ గొడవకి దిగారు. ఈ సమయంలో పోలీసులు కొంతసేపు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. అనంతరం షేజల్ను పోలీసులు రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు. షేజల్కు మద్దతు తెలిపినందుకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు.