నిప్పులు చిమ్ముతూ సూరీడు వైపు…
విజయవంతంగా దూసుకువెళ్లిన పీఎస్ఎల్వీ సీ 57
ISRO: ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతం అయ్యింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్నవిధంగా దూసుకువెళ్ళింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తొలిసారిగా సూర్యుడిపైకి ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పంపింది. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని శనివారం ఉదయం సరిగ్గా 11.50 గంటలకు పీఎస్ఎల్వీ-సీ57 (PSLV-C57) ద్వారా పంపించింది. ఈ ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్1’ (లగ్రాంజ్) పాయింట్‌ను చేరుకోనుంది. ప్రయోగం తర్వాత తొలుత ఆదిత్య-ఎల్1ను పీఎస్ఎల్వీ రాకెట్.. భూ దిగువ కక్ష్యలోకి చేర్చుతుంది.
తర్వాత దాన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇందుకు ఆదిత్య-ఎల్1లోని రాకెట్లను ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఎల్1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం క్రూయిజ్ దశ ప్రారంభమవుతుంది. ఇలా 120 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉపగ్రహం.. ఎల్1 బిందువును చేరుకుంటుంది. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ప్రదేశం నుంచి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది.
మొత్తం 190 కిలోల బరువున్న ఆదిత్య-ఎల్1.. ఐదేళ్ల పాటు సేవలందించేలా రూపొందించారు. భారత్ పంపుతున్న తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం ఇది. సూర్యుడి పుట్టుక, తీరుతెన్నులు, సీఎంఈల గురించి అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఆదిత్య-ఎల్1లోని కీలకమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ).. రోజుకు 1,440 ఫోటోలను పంపుతుంది. అంటే.. నిమిషానికి ఒకటి అన్నమాట. ఇది ఆదిత్య-ఎల్1లో సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనం.