బీఆర్ఎస్కు బిగ్‌షాక్
BRS: మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో పుట్టిన ముసలం ఆ పార్టీ నేతల రాజీమానాలకు దారి తీసింది. నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీ జడ్పీటీసీతో సహా నేతలు తమ రాజీనామా సోమవారం ప్రకటించారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఆయన కుమారుడు విజిత్ ఒంటెద్దు పోకడలు, అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. వారిద్దరూ నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీలో ఉద్యమకారులు, మేధావి వర్గాన్ని అణగదొక్కుతున్నారని విమర్శించారు. వారి అణిచివేత, అరాచక విధానాలతో కలత చెంది తాము బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నామని స్పష్టం చేశారు. తమ రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తారక రామారావు, జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌కు పంపినట్లు స్పష్టం చేశారు.
తాము రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జీ మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో ఈ చేరికలు ఉంటాయని వెల్లడించారు. రాజీమానా చేసిన వారిలో హాజీపూర్ జడ్పీటీసీ పూస్కూరి శిల్ప, హాజీపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పూస్కూరి శ్రీనివాస్‌రావు, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ న్యాయవాది సిరిపురం రాజేశం, ఉపసర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరపు జితేందర్‌రావు, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ సాగె సుమోహన్, మాజీ జడ్పీటీసీ ఆశాలత, నాయకులు రాచకొండ వెంకటేశ్వర్రావు, చిలువేరు నాగేశ్వర్రావు, బెల్లంకొండ మురళీధర్, బొడ్డు శైలజ, శంకర్, దొమ్మటి సత్తయ్య, గొనె సంజయ్‌కుమార్, బొడ్డు తిరుపతి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.