గోవింద కోటి రాస్తే… వీఐపీ ద‌ర్శ‌నం..

Tirumala Tirupati: శ్రీ‌వారి ద‌ర్శ‌నం అంటే అదో అద్భుతం.. కోటి జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం.. ఆయ‌న ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు త‌హ‌త‌హ‌లాడుతారు. ఇక వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం అంటే పైర‌వీలు.. సిఫార్సు లేఖ‌లు.. ఎన్నో ఉంటాయి.. కానీ, సామ‌న్య భ‌క్తుల‌కే వీఐపీ ద‌ర్శ‌నం క‌ల్పించేలా టీటీడీ ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. యువ‌త‌లో భ‌క్తి పెంపొందించేలా.. సామ‌న్యుడికి వీఐపీ ద‌ర్శ‌నం క‌ల్పించేలా అద్భుత‌మైన నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన టీటీడీ నూతన పాలక మండలి మొదటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని అన్నమయ్య భవన్‌లో పాలక మండలి సమావేశమయ్యింది. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. రామకోటి మాదిరిగా గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

25 ఏళ్లలోపు వాళ్లు గోవింద కోటిని రాస్తే.. వారి కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భగవద్గీత పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ముంబాయి బంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచారకేంద్రం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 29 స్పెషలిస్ట్‌, 15 వైద్యులతో పాటు చిన్నపిల్లల ఆసుపత్రిలో 300 ఉద్యోగుల నియామకాలకు అమోదం తెలిపినట్టు వివరించారు.

వీటితో పాటు రూ.2.16 కోట్లతో టీటీడీ ఆస్పత్రుల్లో మెడిసిన్ కొనుగోలు, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు పాలక మండలి సమావేశంలో ఆమోదం లభించినట్టు స్పష్టం చేశారు. స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి 26 వరకూ జరగనున్నాయ‌ని తెలిపారు. అధిక మాసం కావడం వల్ల అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు18 ధ్వజరోహణం సందర్భంగా ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు.

రూ.2 కోట్లతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పున:నిర్మాణం, రూ. 49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమత్తు పనులకు నిధులు కేటాయింస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పోటులో పెండింగ్‌లో ఉన్న 413 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉంటున్న కేశవాయనగుంట వద్ద అభివృద్ది పనులుకు 4.15 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like