నడిపెల్లి గెలుపునకు గడ్డం అడ్డం
-దివాకర్ రావు ఓటమి లక్ష్యంగా పనిచేస్తానన్న అరవిందరెడ్డి
-మంచిర్యాల కార్పొరేషన్ కాకుండా అడ్డుకున్నందుకే అరవింరెడ్డికి కోపం వచ్చిందా..?
-దూతల ఆఫర్ తిరస్కరించిన అరవిందరెడ్డి
-దివాకర్‌రావు ముందున్న దారేంటి..?

Gaddam Aravinda Reddy: వచ్చే ఎన్నికల్లో నడిపెల్లి దివాకర్ రావు గెలుపును గడ్డం అరవిందరెడ్డి అడ్డుకుంటారా..? గతంలో దివాకర్ రావు గెలుపు కోసమే పని చేసిన అరవిందరెడ్డికి ఎందుకు కోపం వచ్చింది..? నడిపెల్లి దివాకర్ రావు ఓటమి కోసం ఎందుకు కంకణం కట్టుకున్నారు..? ఆయనను బుజ్జగించేందుకు దూతల చేసిన కృషి ఫలించలేదా…? మరి నడిపెల్లి దివాకర్ రావు ముందున్న కర్తవ్యం ఏంటి..?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెబుతారు.. మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతోంది. కాంగ్రెస్ మీద, ప్రేంసాగర్ రావు మీద కోపంతో ఆయనను ఓడిచేందుకు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఆయన అనుకున్న విధంగానే గత ఎన్నికల్లో ప్రేంసాగర్ రావును ఓడించారు. గెలుపు అంచుల వరకు వచ్చిన ప్రేంసాగర్ రావు ఓటమికి కారణం కేవలం అరవిందరెడ్డి అంటే అతిశయోక్తి కాదు. అరవిందరెడ్డికి అన్ని పార్టీల్లోనూ శ్రేయోభిలాషులు, శిష్యులు ఉన్నారు. ఆయన మాటను వేదవాక్కుగా భావించే వారు కూడా ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి ఓటు బ్యాంకు కూడా ఉంది.
అయితే, గతంలో ప్రేంసాగర్ రావు ఓటమికి పనిచేసిన అరవిందరెడ్డి ఇప్పుడు నడిపెల్లి దివాకర్‌రావును ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనను ఓడించనిదే నిద్రపోనని అనుచరులు, నాయకులకు స్పష్టం చేశారు. ఇంతకీ ఆయన కోపానికి కారణం నడిపెల్లి దివాకర్‌రావే అనేది కాదనలేని సత్యం. వాస్తవానికి మంచిర్యాలతో పాటు నస్పూరు, పాతమంచిర్యాల, క్యాతన్‌పల్లి మరికొన్ని ప్రాంతాలను కలుపుకుని మంచిర్యాల కార్పొరేషన్ చేయాలని ముఖ్యమంత్రి భావించారు. దానికి తొలి మేయర్‌గా అరవిందరెడ్డి చేయాలని సంకల్పించారు. ఆయన మేయర్ అయితే తన రాజకీయ ప్రాబల్యం దెబ్బతింటుందని భావించిన దివాకర్‌రావు ప్రభుత్వంలోని కొందరు పెద్దల ద్వారా మంచిర్యాల కార్పొరేషన్ కాకుండా అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ఎక్కడికక్కడ మున్సిపాలిటీలు చేయాల్సి వచ్చింది.
ఇది అరవిందరెడ్డి ఆగ్రహానికి కారణమయ్యింది. మరోవైపు మంచిర్యాలలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మొండిచేయి చూపించారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు అరవిందరెడ్డికి ఇది మరింత కోపాన్ని తెప్పించింది. ఎమ్మెల్యే రాజకీయంగా తనను పట్టించుకోకపోవడం, మంచిర్యాల కార్పొరేషన్ కాకుండా అడ్డుకోవడం అరవిందరెడ్డికి రుచించలేదు. ఆయన గెలుపు కోసం తాను కృషి చేస్తే తనను పట్టించుకోకపోవడం ఏమిటనే విషయంలో అరవిందరెడ్డి పార్టీకి దూరమయ్యారు. కొద్ది రోజుల కిందట జరిగిన సమావేశంలో బహిరంగంగానే నడిపెల్లి దివాకర్‌రావుకు టిక్కెట్టు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ఎవరైనా బీసీ అభ్యర్థి ఉంటే తనకు మద్దతు ఇస్తానని వెల్లడించారు.
వరదల సమయంలో సరైన రీతిలో స్పందించలేదని, మాతా శిశు సంరక్షణా కేంద్రం గోదావరి ఒడ్డుకు నిర్మించి అది మునిగిపోవడానికి కారణమయ్యారని, గూడెం ఎత్తిపోతల పథకం నిత్యం లీకేజీలు అవుతున్నా ఆ విషయంలోనూ పట్టించుకోవడం లేదని ఇలా చాలా రకాలుగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు రాజకీయంగా అరవిందరెడ్డిని దగ్గర పెట్టుకోవడంలో విఫలయ్యారు. ఇక ఎమ్మెల్సీ దండేవిఠల్ అరవిందరెడ్డి దగ్గరకు దూతగా వెళ్లారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశ చూపినట్లు తెలుస్తోంది. అయితే, కానీ తనను నమ్మించి మోసం చేశారని తాను తగ్గేది లేదని అలాంటి పదవులు తనకు వద్దని అరవిందరెడ్డి నిరాకరించారు. ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థి ప్రేంసాగర్ రావుతో ఎంత పోరాటం చేయాల్సి వస్తుందో… అరవిందరెడ్డితో సైతం అంతే పోరాటం చేయాలి. లేకపోతే గెలుపు అసాధ్యమేనని చెప్పాలి.