భారత్ నా మనసుకు దగ్గరి దేశం
-ఇక్కడికి పర్యటన ఎప్పుడూ ప్రత్యేకమే
-నేను ఈ దేశానికి అల్లుడ్ని
-బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

G20 Meeting: భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమని యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ అన్నారు. ఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం సునాక్ సతీమణి అక్షతామూర్తితో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. భారత్ పర్యటన తనకు చాలా ప్రత్యేకమని, తనని ‘భారత్కు అల్లుడు’గా వ్యవహరిస్తుంటారని సరదాగా వ్యాఖ్యానించారు. ఆప్యాయతతోనే తనను అల్లుడిగా పిలుస్తున్నట్టు ఆశిస్తున్నానని సునాక్ అన్నారు. కాగా, యూకే ప్రధాని హోదాలో ఆయన భారత్కు రావడం ఇదే మొదటిసారి. భారత సంతతికి చెందిన రిషి.. ఇస్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన భారత్కు అల్లుడయ్యారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి శ్వేతజాతి వ్యక్తిగా.. తొలి ఆసియా వాసిగానూ రికార్డు నెలకొల్పారు.
ఢిల్లీలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే జీ20 కూటమి శిఖరాగ్ర సదస్సు కోసం యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) భారత్కు చేరుకున్నారు. భార్య అక్షతా మూర్తితో కలిసి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి ఆశ్వినీ చౌబే, భారత్లో బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ సహా ఇతర సీనియర్ దౌత్యవేత్తలు ఘన స్వాగతం పలికారు. వారి గౌరవార్థం ఎయిర్పోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనను సునాక్ తిలకించారు. ఈ సందర్భంగా కళా ప్రదర్శనను బ్రిటన్ ప్రధాని ప్రశంసించారు
ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను భారత పర్యటనకు వెళుతున్నట్టు బ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు.