జీ-20 ఇక నుంచి జీ-21
-ప్రతిష్ఠాత్మక కూటమిలోకి మరో దేశం చేరిక
-జీ-20 కూటమి ఏర్పాటు తర్వాత తొలిసారి విస్తరణ
-ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ మోదీ ప్రతిపాదన
-ఆమోదం తెలిపిన మిగతా దేశాలు
G20 that became G21: జీ 20 కూటమి జీ 21 కూటమిగా మారింది. జీ 20 సభ్యదేశాల కూటమి విస్తరించి.. మరో సభ్య దేశాన్ని ఈ కూటమిలోకి ఆహ్వానించారు. ఈ కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారి విస్తరించడం విశేషం కాగా, మన దేశం అధ్యక్షతన ఈ ఘనత సాధించడం మరో విశేషం. జీ 20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. మిగతా సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి.
జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారత్ ఈ సదస్సు నిర్వహిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సమావేశాలకు ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాలకు చెందిన నేతలకు ఎలాంటి లోటు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. వివిధ దేశాలకు చెందిన అధినేతలు ఢిల్లీకి చేరుకుని సమావేశాల్లో పాల్గొన్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లోనే జీ 20 కూటమి విస్తరించారు. ఇది భారత్ ఆతిథ్యం ఇస్తున్న వేళ జరగడం మన దేశానికి మరో గర్వకారణంగా నిలిచింది. వన్ ఎర్త్ సెషన్ ప్రారంభ ఉపన్యాసంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఆఫ్రికన్ యూనియన్ను జీ 20 కూటమిలోకి ఆహ్వానిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు జీ 20 దేశాల సభ్యులు అందరూ అంగీకరించడంతో.. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ యూనియన్ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టి అధికారిక లాంఛనాలు పూర్తి చేశారు.
సబ్కా సాథ్ భావనతోనే ఆఫ్రికన్ యూనియన్‌కు జీ 20 కూటమిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సదస్సులో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అందరు సభ్యదేశాధినేతలు అంగీకారం తెలుపుతారని నమ్ముతున్నట్లు చెప్పారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష హోదాలో భారత్ ఆఫ్రికన్ యూనియన్‌కు స్వాగతం పలుకుతున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ మేరకు ఆఫ్రికన్ యూనియన్ ఛైర్మన్ అజాలీ అసౌమనీని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్వయంగా తీసుకువచ్చి శాశ్వత సభ్యదేశాల కుర్చీలో కూర్చో పెట్టారు. 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దశ, దిశ సూచించడానికి ఇదే సరైన సమయమని గుర్తు చేశారు.