చంద్రబాబుకు బెయిల్..

అదేంటి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది… ఆయనను జైల్‌కి తరలించారు.. మళ్లీ అప్పుడే బెయిల్ ఏంటి అనుకుంటున్నారా..? నిజమే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందనే ఏకంగా పోలీసులే చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే…
అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సెల్ టవర్ ఎక్కాడు. తమ అభిమాన నేతను విడుదల చేయకుంటే.. అక్కడ నుంచి దూకేస్తానని బెదిరించాడు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన మంజునాథ్ టీడీపీ కార్యకర్త. తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా అమితమైన అభిమానం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారనే వార్త విని మంజునాథ్ ఆందోళనకు గురయ్యాడు. టీడీపీ జెండా చేత పట్టుకొని సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, లేకుంటే.. సెల్ టవర్ మీద నుంచి దూకుతానని హెచ్చరించాడు.
మంజునాథ్ సెల్ టవర్ ఎక్కిన విషయాన్ని స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంజునాథ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. అతడు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు తెలివిగా వ్యవహరించారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని, ఆయన బయటకు వచ్చారని నమ్మించి, మంజునాథ్‌ను కిందకు దింపారు.