ఖైదీ నంబర్ 7691

Chandrababu Naidu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. వర్షం కురుస్తుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమహేంద్రవరం చేరుకోవడానికి 5 గంటలకు పైగా పట్టింది. జైలు అధికారులు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. రాత్రి ఒంటిగంట సమయంలో చంద్రబాబును జైలులోని స్నేహ బ్లాక్‌కి తరలించారు. జైలు దగ్గరకు వచ్చిన లోకేష్.. తండ్రితో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత పోలీసులు.. అక్కడి నుంచి అందర్నీ పంపించేశారు. చంద్రబాబుకి ప్రత్యేక భద్రత కల్పిస్తామని అధికారులు తెలిపారు. జైలు దగ్గర 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో రెండు పిటిషన్లు వేశారు. జైలుకు తరలించకుండా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలనీ, లేదా సెంట్రల్ జైలుకి తరలిస్తే, ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించాలని ఒక పిటిషన్ చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఇంటి భోజనం, మందులు తీసుకునేందుకు అనుమతించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. మొదటి పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు, రెండో పిటిషన్‌కి ఓకే చెప్పింది. భద్రతా కారణాల వల్ల మిగిలిన ఖైదీలతో కాకుండా, చంద్రబాబుని జైలులో ప్రత్యేకంగా ఉంచాలని కోర్టు ఆదేశించింది. జైలులో ఉన్నా ఇంటి భోజనం, మందులు తెప్పించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అందువల్ల ఆయనకు రోజూ ఇంటి భోజనం, మందులు వస్తాయి.