విద్యార్థులకు రిలయన్స్ స్కాలర్షిప్స్

Reliance Foundation Scholarship: విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ తమ వంతుగా సాయం అందిస్తోంది. యువత ఉన్నత చదువులు చదవడం, విజయవంతమైన నిపుణులుగా ఎదగడం తద్వారా తమ కలల్ని నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో రిలయన్స్ ఫౌండేషన్ వారికి స్కాలర్షిప్ అందించేందుకు కృషి చేస్తోంది. చదువుకోవాలన్న ఆశ ఉండి.. డబ్బుల్లేక చదువుకోలేని విద్యార్థుల కోసం స్కాలర్షిప్స్ అందిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం ఈ స్కాలర్షిప్స్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఈసారి 5 వేల మందికి స్కాలర్షిప్స్ అందించనుంది. చివరి తేదీ అక్టోబర్ 15గా నిర్ణయించారు. అప్పటిలోగా దరఖాస్తు చేసుకున్న అన్ని బ్రాంచుల్లో ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అందరికీ అందుబాటులో ఉంటుంది.
డిగ్రీ, పీజీ చదువుకోవడానికి ఆసక్తి ఉండి ఫీజు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఈ స్కాలర్ షిప్ ప్రయోజనకరంగా ఉంటుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా 5000 UG స్కాలర్షిప్లు మరియు 100 PG స్కాలర్షిప్లను అందిస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ UG స్కాలర్షిప్ కోసం గరిష్టంగా రూ. 2 లక్షలు మరియు PGకి గరిష్టంగా రూ. 6 లక్షల స్కాలర్షిప్గా నిర్ణయించింది. అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం కోర్సు మొత్తానికి కలిపి రూ. 2 లక్షల స్కాలర్షిప్ అందిస్తోంది. ఈ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. 5 వేల మందికి అవకాశం ఉంది. మహిళా విద్యార్థులు, వికలాంగులకు ఇందులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్స్ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2022-23 సమయంలో ఈ స్కాలర్షిప్స్ కోసం లక్ష మంది వరకు అప్లై చేసుకోవడం విశేషం. వీరిలో ఎంపికైన వారిలో 57 శాతం మహిళలు ఉండగా.. 97 మంది వికలాంగులు ఉన్నట్లు తెలిసింది.
1996 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ ధీరూభాయ్ అంబానీ స్కాలర్షిప్స్, రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ అందిస్తోంది. మీరు అండర్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం విద్యార్థులైతే రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ పొందాలనుకుంటే ఈ వెబ్సైట్ www.scholarships.reliancefoundation.org సందర్శించండి. అక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.