ఇంద్రకరణ్‌రెడ్డి దొంగ ఓట్లతో గెలుస్తున్నడు
-ఢిల్లీలో కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం
-మంత్రి, ఆయన బంధువుల భూ కబ్జాల వల్లే నిర్మల్ నీట మునిగింది
-ఇక అవినీతి మంత్రిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
-రైల్వే లైన్ నా కృషి అని చెప్పుకోవడానికి మంత్రికి సిగ్గులేదా..?
-ఇంద్రకరణ్‌రెడ్డిపై దుమ్మెత్తిపోసిన బీజేపీ నేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి

Eleti Maheshwar Reddy: నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి దొంగ ఓట్ల వల్లే గెలుస్తున్నాడని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. ఆయన నిర్మల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఎన్నికలు వచ్చిన ప్రతి సారి బూటకపు హామీలతో ప్రజలను మభ్య పెడుతూ, దొంగ ఓట్లతో గెలుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక దొంగ సారాతో, అవినీతి సొమ్ముతో గెలుస్తూ వచ్చారని దుయ్యబట్టారు. ఇక ఈ అవినీతి మంత్రి నీ ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు గనక వేలాదిగా ఒక వర్గానికి చెందిన దొంగ ఓట్లను నమోదు చేయించి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
నిర్మల్ లో మొత్తం గా 32,000 దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఇంటి నంబర్ పై 10 ఓట్లకు పైగా 1,553 ఇండ్లలో 21,906 ఓట్లు నమోదయ్యాయని ఏలేటీ స్పష్టం చేశారు. ఇంటి నంబర్ లేకుండా ప్రశ్నార్థకం గుర్తుతో, ఇంటి నంబర్ 0- 0 తో 670 ఓట్లకు పైగా ఉన్నాయన్నారు. ఒకే ఇంట్లో 20 నుండి 100 కు పైగా ఓట్లు ఉన్న 4,240 ఓట్లు నమోగు అయ్యాయని స్పష్టం చేశారు. నిర్మల్ పట్టణం లో ఇంటి నంబర్లు 19,500 ఉంటే ప్రస్తుతం 25,000 ఇంటి నంబర్ల పేరుతో దాదాపుగా 5000 ఇంటినంబర్లు బోగస్ అని తెలిసిందని వెల్లడించారు. దొంగ సారా, దొంగ కలప వ్యాపారం చేసే మంత్రి దొంగ ఓట్ల ను కూడా నమోదు చేయించడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చిల్లర పనులు చేస్తున్నారన,ఇ ఓట్లను చీల్చడం కోసం తన అనుచరులను కాంగ్రెస్ పార్టీ లోకి పంపారని మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.
ప్రజలను మోసం చేసిన పార్టీ BRS ను ప్రజలు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారన్నారు. నిర్మల్‌లో మంత్రి, మంత్రి బంధువులు చేసిన భూ కబ్జాల వల్ల చిన్నపాటి వర్షానికే నిర్మల్ పట్టణం నీట మునిగే పరిస్థితి నెలకొందన్నారు. మంత్రి ఇంటి ముందు రోడ్లు సైతం చెరువును తలపించడం మంత్రి అసమర్థ పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ లో భూములు, చెరువులు అన్ని కబ్జా చేసేశారు.. ఇక మంత్రి మంత్రి బంధువుల కన్ను గుట్టలపై పడిందన్నారు. ఎక్కడికక్కడ గుట్టలను కబ్జా చేస్తున్నారని మండి పడ్డారు. నిర్మల్ రైల్వే లైన్ కు రాష్ట్ర నిధులు కేటాయించకుండా పెండింగ్ లో ఉంచారని రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేని నరేంద్ర మోడీ వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మల్ కు రైల్వే లైన్ మంజూరు చేస్తే దానిలో మంత్రి కృషి ఉందని చెప్పుకోవడానికి సిగ్గు లేదా..? అని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, ఢిల్లీ లోని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను రాష్ట్ర నాయకత్వంతో రేపు ఢిల్లీ లో కలవనున్నామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను, అలాగే మాస్టర్ ప్లాన్ రద్దు పై నిర్మల్ లో జరిగిన లాఠీ ఛార్జ్ ఘటన విషయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్, బీసీ కమిషన్, SC,ST కమిషన్ ను దృష్టికి తీసుకువెళ్తామన్నారు. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసు అధికారులపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, సాదం అరవింద్, భూపాల్ రెడ్డి, భూపతి రెడ్డి, సరికెల గంగన్న, మార గంగారెడ్డి, నారాయణ్ రెడ్డి, జమాల్, గోవర్ధన్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.