15,072 కేసుల పరిష్కారం
పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన సీపీ రెమా రాజేశ్వరి

Ramagundam Police Commissionerate: లోక్ అదాలత్లో రామగుండం కమిషనరేట్ అత్యున్నత స్థానాన్ని సాధించింది. పెద్ద ఎత్తున రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారం అయ్యాయి. దీంతో లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోని టాప్ 10 యూనిట్లలో 7వ స్థానం, ఎఫ్ఐఆర్ కేసుల పరిష్కారానికి సంబంధించి 3వ స్థానంలో నిలిచింది.
కేసుల్లో రాజీ కుదిర్చేందుకు సెప్టెంబరు 9న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి సూచనల ప్రకారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఈ లోక్అదాలత్లో 15,072 కేసులు పరిష్కరించారు. రాష్ట్రంలోని టాప్ 10 యూనిట్లలో 7వ స్థానం, ఎఫ్ఐఆర్ కేసుల పరిష్కారానికి సంబంధించి 3వ స్థానంలో నిలిచారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అభినందించారు.
కమిషనర్ రెమా రాజేశ్వరి పెద్దపల్లి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి హేమంత్ కుమార్, మంచిర్యాల జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, సెషన్స్ జడ్జి కె.ప్రభాకరరావుని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జాతీయ లోక్ అదాలత్లో పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.