మళ్లీ కాంగ్రెస్ గూటికి నల్లాల
Nallala Odelu: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంచార్జి ఠాక్రే తదితరుల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయన అసంతృప్తితో ఉన్నారని గులాబీ పార్టీని వీడతారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలింది.
బాల్క సుమన్ ఎంపీగా లేకపోతే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ, అదేమీ జరక్కపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఓదెలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓదెలును చేర్చుకోవడానికి ఓకే చెప్పిన నేతలు శుక్రవారం ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన ప్రాతినథ్యం దక్కడం లేదని ఓదెలు దత ఏడాది మే 19న ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నాలుగు నెలల్లోనే తిరిగి కారెక్కారు.
ఆయన కొద్ది రోజులుగా బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే నిన్నటివరకు తమను తిట్టిపోసిన పార్టీ నేతలను చేర్చుకుంటే విమర్శలు వస్తాయని కమలనాథులు ఆయనను పట్టించుకోలేదు. టికెట్ కోసమే పార్టీలో చేరుతున్నారని, ఆయనకు టికెట్ ఇస్తే కార్యకర్తలు తిరగబడతారని వెనకడుగు వేశారు. దీంతో ముఖ్యమైన నేతలతో చర్చించిన నల్లాల ఓదెలు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.