అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు పగలగొట్టడంపై ప్రజాగ్రహం

అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు పగలగొట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ ఇష్టారాజ్యంగా సెంటర్లకు వచ్చి తాళాలు పగలగొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో శనివారం ఎంపీడీవో, ఐసీడీఎస్ సిబ్బంది, పోలీసులతో సహా కొన్ని సెంటర్ల తాళాలు పగలగొట్టారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త తాళాలు వేసి వాటిని మహిళా సంఘాల గ్రూపులకు అందించారు. కొందరు గ్రూపు సభ్యులు సైతం వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని పట్టుబట్టి మరీ వారికి తాళాలు అందించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలని వాటిని తప్పకుండా పాటించాలని వారికి తాళాలు ఇచ్చారు. అయితే, పలువురు స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు ఇలా దౌర్జన్యం చేయడం సమంజసం కాదంటూ దుయ్యబట్టారు. తమకు పాత టీచర్లే కావాలని కొత్త వారిని పంపిస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్ కు అధికారులు వేసిన తాళంపై మళ్లీ వారు తాళం వేశారు.