మూడు దశాబ్దాల కల
Women’s reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఎన్నో ఏండ్లుగా అటకమీద ఉన్న ఈ బిల్లు బూజు దులిపి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రి మండలి సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదం సైతం తెలపనుంది. అదే జరిగితే ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెర లేచినట్లేనని పలువురు స్పష్టం చేస్తున్నారు.
ఇప్పుడు దేశమంతటా మహిళా రిజర్వేషన్ బిల్లుపైనే చర్చ జరుగుతోంది. సోమవారం రాత్రి.. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇది ఉభయసభల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ బిల్లు? దీని చరిత్ర ఏంటి? వాస్తవానికి ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినా ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దకావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోడీ సారథ్యంలోని కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజీవ్ గాంధీ హయాంలో తొలిసారిగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం తెరపైకి వచ్చింది. 1989లో ఈ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగాన్ని సవరించాలని రాజీవ్ స్పష్టం చేశారు. బిల్లు లోక్‌సభలో గట్టెక్కినా రాజ్యసభలో మాత్రం ఆమోద ముద్రపడలేదు. 1992, 1993లో నాటి పీవీ నర్సింహ రావు ప్రభుత్వం 72-73వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అర్బన్, రూరల్ లోకల్ వ్యవస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా అప్పటి ప్రభుత్వం రూపొందించింది. ఉభయసభల్లో ఈ బిల్లు గట్టెక్కి చట్టంగా కార్యరూపం దాల్చింది. ఫలితంగా.. ఈరోజున దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 15లక్షల మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు.
ఇక 1996 సెప్టెంబర్ 12న.. దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి తొలిసారి.. 81వ రాజ్యాంగ చట్టసవరణ బిల్లు తీసుకొచ్చింది. ఇది లోక్‌సభలోనే గట్టెక్కలేపోయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీనిని సిఫార్సు చేశారు. 1996 డిసెంబర్లో.. కమిటీ తన నివేదిక బయటపెట్టింది. లోక్‌సభ రద్దు అవ్వడంతో బిల్లును ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు లోక్‌సభ రద్దు అవ్వకపోయి ఉంటే అప్పుడే బిల్లు పాస్ అయ్యేది. రెండేళ్ల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తావించింది. ఈసారి కూడా బిల్లుకు మద్దతు లభించలేదు. 1999, 2002, 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా పార్లమెంట్లో విఫలమయ్యాయి.
ఐదేళ్ల తర్వాత.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ బిల్లును ప్రస్తావించింది. 2008 మే 6న ఈ బిల్లును రాజ్యసభలోకి తీసుకొచ్చింది. 1996 సంవత్సరంలో కమిటీ చేసిన 7 సిఫార్సులో ఐదింటిని ఈ బిల్లులో చేర్చారు. కొన్ని రోజులకే ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించారు. 2009 డిసెంబర్లో స్టాండింగ్ కమిటీ నివేదిక వచ్చింది. 2010 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర కేబినెట్.. ఆమోద ముద్రవేసింది. చివరికి.. 2010 మే9న రాజ్యసభలో ఈ బిల్లు గట్టెక్కింది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ ముందుకు రానేలేదు. 2014లో లోక్‌సభ రద్దు అయ్యింది. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు లోక్‌సభలో ఈ బిల్లును ప్రస్తావించలేదు.
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుపలికే వారితో పాటు వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. విధానాల రూపకల్పనలో మహిళల పాత్ర ఉండాలని, లింగ సమనత్వం సాధించాలంటే ఈ బిల్లును పాస్ చేయాలని మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో.. ఒక కులానికి ఇచ్చే రిజర్వేషన్లతో ఈ మహిళా రిజర్వేషన్లను పోల్చకూడదని ఇంకొందరు అంటున్నారు. ఈ బిల్లు గట్టెక్కితే.. రాజ్యాంగంలో ఉన్న సమానత్వ భావాలకు గండిపడుతుందని ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్ వస్తే.. మెరిట్ ఆధారంగా వచ్చే స్థానాలు పోతాయని అంటున్నారు. రాజ్యసభలో ఉన్న ఎన్నికల ప్రక్రియ కూడా ఈ రిజర్వేషన్‌కు సహకరించదని గుర్తుచేస్తున్నారు.
ఈ బిల్లు గట్టెక్కితే.. లోక్‌సభతో పాటు అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా రాష్ట్రల్లో ఆయా అసెంబ్లీలో పది కంటే తక్కువగా ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చరు. అందులో మన తెలుగు రాష్ట్రలు కూడా ఉండటం గమనార్హం. లోక్‌సభలోని 543మంది సభ్యుల్లో మహిళ వాటా 15శాతంగా ఉంది. అదే రాజ్యసభ విషయానికొస్తే.. ఇది 14శాతం మాత్రమే ఉంది.మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉభయ సభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉండటంతో.. ఈసారి ఈ బిల్లు గట్టెక్కే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.
బిల్లు గట్టెక్కితే ఖచ్చితంగా చట్టసభల్లో వారి ప్రాతినిథ్యం పెరుగుతుంది. అదే సమయంలో వారికి ఏం కావాలో వారికి తెలుసు కాబట్టి మహిళలకు సంబంధించి చాలా అంశాలు చర్చకు వచ్చి తద్వారా అవి పరిష్కారం అవుతాయి..